రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
పవన్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
పదేళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా... మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
ఉప ముఖ్యమంత్రి సర్జరీ చేయించుకోవటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టోలో.. ‘ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సమయంలో ఆయనకు మంచి ఆరోగ్యం చేకూరాలని, తగిన శక్తి లభించాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం (జూలై11) ముంబైలో విజయవంతంగా కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉండటంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ముందే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే కోలుకోవడం కష్టమవుతుందని వైద్యులు సూచించడంతో తొలుత కుడి భుజానికే ఆపరేషన్ చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు వెల్లడించారు. ఎడమ భుజానికి రెండు నెలల తర్వాత మరో శస్త్రచికిత్స చేయనున్నారు.
పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజానికి గాయం అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోరాట యాత్ర, రైతు పర్యటనలు, వారాహి యాత్ర, ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు కరచాలనం చేయడం, చేతులు పట్టి లాగడం వంటి సందర్భాల్లో గాయాలు మరింత తీవ్రతరమైనట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.







