రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా?
వైసీపీ కుల రాజకీయాలపై పవన్ కల్యాణ్ విమర్శ
అమరావతి : భాష ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులను కూడా నేటి రాజకీయాలు కుల చట్రాల్లో బంధించడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తం అవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన కుల నిర్మూలన లక్ష్యాన్ని పక్కనబెడితే, 1989 నుంచి రాజకీయాల్లో కుల దూషణలు విపరీతంగా పెరిగిపోయాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారిందని, సమాజానికి అద్దం పట్టే జర్నలిస్టులను సైతం కులాల పేరుతో దూషించడం ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
ఒక వ్యక్తి తప్పు చేస్తే, దానికి కులాలను ఆపాదిస్తూ సమాజంలో చిచ్చు పెడుతున్న ధోరణిని పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని హత్య చేసి, శవాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేసినా ఆ పార్టీ అతనికి వెనుకేసుకొచ్చిందని ఆయన విమర్శించారు. డాక్టర్ సుధాకర్‌ను మానసికంగా హింసించి చంపేసినా ఆయా కుల సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కొంతమంది స్వార్థపరులు కుల సంఘాలను అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా బాగుపడుతున్నారనే అనుమానం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ కులం నాయకుడితో ఆ కులం వారినే తిట్టించే నీచ సంస్కృతి వల్ల యువత భావోద్వేగాలకు లోనవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైసీపీ తీరు మారలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి కుల రాజకీయాలకు చరమగీతం పాడాలని జనసేన గట్టిగా నిర్ణయించుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో కుల దూషణల అంశంపై విస్తృతంగా చర్చించామని, ఎవరు ఎలా మాట్లాడినా తాము అందరం కలిసికట్టుగా స్పందించేలా నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఇకపై రాజకీయాల్లో జరిగే కుల దూషణలను, అరాచకాలను తిప్పికొట్టేందుకు జనసేన తరఫున ‘సేన గళం’ పేరుతో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇకపై ఎవరు కులాల పేరుతో దూషణలకు పాల్పడ్డా ‘సేన గళం’ గట్టిగా స్పందిస్తుందని ఉపముఖ్యమంత్రి హెచ్చరించారు.







