పవన్ కళ్యాణ్‌పై రాహుల్ రామకృష్ణ ప్రశ్నల దండకం

టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాలో చేసిన వరుస ట్వీట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. సామాజిక, రాజకీయ అంశాలపై తరచూ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే రాహుల్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ బాధ్యతలో ఉన్న శాఖల పనితీరు, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ రాహుల్ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అమలు, గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలు, అటవీకరణ కార్యక్రమాలపై ఆయన ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సమాచార హక్కు చట్టం అమలుపై రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్‌లో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

ఇదే ట్వీట్‌లో రాహుల్, పవన్ కళ్యాణ్ అభిమానిగా తనను తాను పరిచయం చేసుకుంటూ, ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉపముఖ్యమంత్రిపై ఉందని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4.1(బి) ప్రకారం ముందస్తు సమాచార బహిర్గతం ఎంతవరకు జరుగుతోందనే అంశాన్ని ఆయన ప్రధానంగా లేవనెత్తారు.

గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలు, అటవీకరణ కార్యక్రమాలపై కూడా రాహుల్ మరో ట్వీట్‌లో ప్రశ్నలు సంధించారు.

ఈ ట్వీట్ ముగింపులో రాహుల్ రామకృష్ణ ‘జై తెలంగాణ’ అని నినదించడం విశేషంగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తాను చేసిన ప్రశ్నలపై జనసేన శ్రేణులు, పవన్ అభిమానుల నుంచి ట్రోలింగ్ వచ్చే అవకాశాన్ని ముందుగానే ఊహించిన రాహుల్, మరో ట్వీట్‌లో తాను దేశద్రోహి కాదని స్పష్టం చేశారు.

రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్లపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ లేదా జనసేన అధికారికంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రాహుల్ ప్రశ్నలను సమర్థిస్తుండగా, మరికొందరు ఆయనను విమర్శిస్తున్నారు.