రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు…
పశ్చిమగోదావరి : ప్రజల భవిష్యత్తు బాగు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు కొరత రాకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడూ గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుందని, పంటలు పండించడంలో ఈ జిల్లాకు చెందిన రైతులకు మించిన వారు లేరని కొనియాడారు. రాయలసీమ, విశాఖ జిల్లాల్లో పరిశ్రమల కోసం భూములు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే గోదావరి జిల్లాలో మాత్రం సెంటు భూమి కూడా ఇవ్వబోమని స్పష్టం చేశారు.
అక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రశాంతంగా ఉండే ఈ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, గొడవలు సృష్టించారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని, గొడ్డలి పట్టుకునే వారికి నాగలి పట్టుకున్న రైతు గుర్తుకు రాలేదని విమర్శించారు.
మీ భూమి మీద సైకో ఫొటో వేశారు. భూమి మీది.. ఫొటో సైకోది.. నిద్ర లేస్తూనే ఆయన మొహం చూడాల్సి వచ్చేది. జగన్ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడ ఉందో తెలీదు. మీకేమైనా తెలిస్తే, ఆ అడ్రస్ ఆయనకు పంపుతాను
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని చంద్రబాబు తెలిపారు. QR కోడ్‌తో రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలను జారీ చేశామని, ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరని చెప్పారు. రీసర్వేలో E-KYC అమలు చేసి రైతులను భాగస్వాములను చేశామని, 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూ రికార్డులను అప్డేట్ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 26 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని, నిషేధిత జాబితా 22Aలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.8 వేల కోట్ల అన్నదాత సుఖీభవ నిధులను జమ చేశామని చంద్రబాబు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు నగదు చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని, యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిందని విమర్శించారు. త్వరలో అక్వా రైతుల సమస్యలను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు.
నా దగ్గర తోక జాడిస్తే చూస్తూ ఊరుకోను. నేను సీఎంగా ఉన్నంతవరకు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను. గొడ్డలి పార్టీవి అన్నీ తప్పుడు ప్రచారాలే. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర వైసీపీది. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాకే జగన్ రాజకీయాలు చేసుకోవాలి. వివేకాను చంపి.. నా చేతిలో గొడ్డలి పెట్టారు. జగన్ వంటివారికి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పాలి. పరీక్షలు అంటే తెలియనివాళ్లు విమర్శలు చేస్తున్నారు
తెలంగాణలోనూ వైసీపీ నేతలు భూములను కాజేయాలని చూశారని సీఎం ఆరోపించారు. ఇక్కడ చాలదన్నట్లు అక్కడ కూడా కబ్జాలు చేయాలని ప్రయత్నించారని విమర్శించారు. కోడికత్తి డ్రామాలు చేసేవారికి రైతుల బాధలు తెలియవని, తిరుమల దేవదేవుడి అంశంలోనూ ద్రోహం చేశారని మండిపడ్డారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారని ఆరోపించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దుర్మార్గులను దూరం పెట్టాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.







