రాజ్యసభకు టీడీపీ అభ్యర్థులు ఖరారు

మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్

అమరావతి : రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ పేరును ఖరారు చేయడంతో పాటు ఆయన నామినేషన్‌ దాఖలు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన మూడు స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరఫున సాన సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లను ఎంపిక చేసింది. దీంతో చింతకాయల కు లక్కీఛాన్స్ అని చెప్పవచ్చు.

ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సాన సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లను ఖరారు చేశారు. తాజాగా మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్ పేరును ప్రకటించారు. ఈ స్థానానికి విజయ్ పేరుతోపాటు సీనియర్‌ నేత వర్ల రామయ్య పేరును కూడా చివరి దశ వరకు పరిశీలించిన చంద్రబాబు, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, యువత, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే దృష్ట్యా విజయ్ వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సాన సతీష్, భాష్యం రామకృష్ణ ఇద్దరూ కోస్తా ప్రాంతానికి చెందినవారు. వర్ల రామయ్య కూడా అదే ప్రాంతానికి చెందిన నాయకుడు కావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నర్సీపట్నం కు చెందిన విజయ్ కు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా సాన సతీష్ పదవీకాలం ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో, సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయన పేరును మళ్లీ ఖరారు చేశారు. జనసేన పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు టికెట్‌ ఇవ్వడం కూడా ఈ సమీకరణలో భాగంగానే పార్టీ భావించినట్లు చెబుతున్నారు.

ఆశావహులకు బుజ్జగింపులు..

రాజ్యసభ అభ్యర్థిత్వం ఆశించిన వర్ల రామయ్య, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు , టీడీ జనార్దన్ లను తెలుగుదేశం పార్టీ నాయకత్వం బుజ్జగించినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు వారికి ఫోన్‌ ద్వారా మాట్లాడి, ఏ పరిస్థితుల్లో అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారో వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సరైన సమయంలో తగిన గుర్తింపు తప్పక ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.