అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లే వారెవరు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. జనసేన ఇప్పటికే తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీశ్‌కు మరోసారి అవకాశం దక్కడం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అలాగే విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణను కూడా పెద్దల సభకు పంపే దిశగా టీడీపీ ఆలోచనలు సాగుతున్నాయి.

మూడో అభ్యర్థి ఎవరనే అంశంపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. బీసీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌ పేరు ముందుకు వస్తోంది. ఎస్సీ వర్గానికి అవకాశం కల్పించాలని నిర్ణయిస్తే సీనియర్‌ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సానా సతీశ్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడానికి పలు కారణాలు ఉన్నట్లు సమాచారం. గతంలో మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానంలో సానా సతీశ్‌ను రాజ్యసభకు పంపారు. ఆయన పదవీకాలం ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో, మళ్లీ అవకాశం ఇవ్వడం న్యాయమని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో సామాజిక సమీకరణాల కోణం కూడా ఉందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా కాపు వర్గాన్ని వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు అంతర్గతంగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కమ్మ వర్గానికి చెందిన లింగమనేని రమేశ్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో, టీడీపీ కాపులకు ప్రాతినిధ్యం కల్పించకపోతే వైసీపీ దానిని రాజకీయంగా వినియోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారని చెబుతున్నారు. కాపు వర్గానికి చెందిన సానా సతీశ్‌ను ఎంపిక చేస్తే ఆ అవకాశం వైసీపీకి దక్కదనే లెక్కలు టీడీపీ వేసుకుంటోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. భాష్యం రామకృష్ణ విషయంలో కూడా టీడీపీ దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీకి విధేయుడిగా సేవలందిస్తున్న ఆయనను పెద్దల సభకు పంపాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ టికెట్‌ కోసం ఆయన ఆశించినప్పటికీ, చివరకు వివిధ సమీకరణాల కారణంగా అవకాశం దక్కలేదు. భవిష్యత్తులో న్యాయం చేస్తామని అప్పుడే ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంగానే ఈ నిర్ణయం చూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదరహితుడిగా పేరున్న భాష్యం రామకృష్ణను ఎంపిక చేయడం ద్వారా పార్టీని నమ్ముకున్న క్యాడర్కి న్యాయం చేశామనే సందేశం వెళ్లుతుందని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.

మూడో స్థానం బీసీకా? ఎస్సీకా?

మూడో స్థానాన్ని బడుగు, బలహీన వర్గాలకు కేటాయించాలనే విధానాన్ని టీడీపీ తొలి నుంచీ అనుసరిస్తోందని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఒక దశలో రాజకీయాల్లో లేని, పక్క రాష్ట్రానికి చెందిన కొందరి పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, చివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉండి, ఇక్కడే పార్టీకి సేవలందిస్తున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐ-టీడీపీ సారథిగా చింతకాయల విజయ్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ దాడులను సోషల్‌ మీడియా వేదికగా గట్టిగా ఎదుర్కొన్న నాయకుల్లో ఆయన ముందుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయ్యన్న పాత్రుడు మంత్రి పదవి ఆశించినప్పటికీ, పార్టీ ఆదేశాల మేరకు స్పీకర్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం కూడా టీడీపీ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో ఆ కుటుంబానికి ఉన్న బలమైన పట్టు దృష్ట్యా చింతకాయల విజయ్‌ను రాజ్యసభకు పంపాలనే ఆలోచన పార్టీ లోపల చర్చనీయాంశంగా మారింది.

వర్ల రామయ్యకే ఛాన్స్?..

అదే సమయంలో ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనుకుంటే వర్ల రామయ్యకే అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పార్టీలో సీనియర్‌ నేత. గతంలో ఓటమి తప్పదని తెలిసినా, పార్టీ ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. చింతకాయల విజయ్‌ యువ నాయకుడు కావడంతో భవిష్యత్తులో ఇంకా అవకాశాలు ఉన్నాయని, వర్ల రామయ్య వయస్సు రీత్యా పెద్దవారిగా ఉండటంతో ఇప్పుడే అవకాశం ఇవ్వడం సముచితమనే అభిప్రాయం కొందరు నేతల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. వర్ల రామయ్యను ఈసారి ఎంపిక చేసి, భవిష్యత్తులో చింతకాయల విజయ్‌కు తగిన స్థాయిలో అవకాశం కల్పిస్తామని అయ్యన్న పాత్రుడిని టీడీపీ అధిష్ఠానం సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తంగా, సానా సతీశ్‌, భాష్యం రామకృష్ణ పేర్లు దాదాపు ఖరారై, మూడో స్థానంపై తుది నిర్ణయాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.