జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌లకు మద్దతు ఇస్తున్నదెవరు?

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జోసెఫ్‌ రావణ్‌, సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ల వ్యవహారంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇద్దరికీ ఎవరు మద్దతు ఇస్తున్నారు, వారి నేపథ్యం ఏమిటన్న అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌లకు మద్దతు ప్రకటిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. వారిద్దరూ ఏ సంస్కృతికి వారసులు, వారి కుటుంబ మూలాలు ఎక్కడన్న దానిపై సందేహాలు వ్యక్తం చేశారు. వారి తండ్రులు, తాతలు ఎవరు, వారి మూలాలు ఎక్కడన్న విషయాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

తప్పుగా మాట్లాడేవారికి చట్టం, సమాజం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. అభ్యంతరకర వ్యాఖ్యల ద్వారా దాడి చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌లా మారిందని విమర్శించారు. మతం మారిన కొన్ని కులాల్లోని కుటుంబాలు హిందుత్వంపై విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు.

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌లను వైసీపీ సమర్థించడం అంటే దేశంపై చేస్తున్న దాడిగానే పరిగణించాలని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశద్రోహ కుట్రలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

తప్పుగా మాట్లాడినవారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష విధించినా తప్పులేదని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. దేశం, హిందుత్వంపై దాడులు చేసే వారిని చట్టం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.