విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంతో తిరుపతి ‘సంక్షేమం’ సభ వాయిదా

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం ఈ నెల 9న తిరుపతిలో నిర్వహించాలనుకున్న బహిరంగ సభను వాయిదా వేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో సభను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కూటమి వర్గాల సమాచారం ప్రకారం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం వివరాలు తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, కూటమి కీలక నేతలు పవన్‌ కల్యాణ్‌, మాధవ్‌లతో చర్చించారు. ఈ చర్చల అనంతరం తిరుపతిలో జరగాల్సిన సభను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘సంక్షేమం’ పేరుతో విజయోత్సవ బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. ఈ సభలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే, సోమవారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌ ఎఫ్‌జీ విభాగంలో స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ పేలిపోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగిన ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సుమారు 1,500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ ద్వారా ఉక్కుద్రవాన్ని లిఫ్ట్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతులైన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలాన్ని ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్‌ పరిశీలించారు. పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇలాంటి విషాద సమయంలో విజయోత్సవ సభ నిర్వహించడం సముచితం కాదని భావించిన కూటమి ప్రభుత్వం, తిరుపతి సభను వాయిదా వేసింది. సభకు కొత్త తేదీని తరువాత ప్రకటించనున్నట్లు కూటమి వర్గాలు సూచించాయి.