మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు

విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం

విశాఖపట్నం: విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ క్యాంపస్‌ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై సీఎం పలు సూచనలు చేశారు. వర్సిటీకి అవసరమైన విద్యుత్‌ను స్వయంపూర్తిగా ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాల పైకప్పులపై సోలార్ పానెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే లక్షల రూపాయల విలువైన విద్యుత్‌ ఆదా అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తాం. వర్సిటీకి కావాల్సిన కరెంటును వందశాతం ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలి. చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే రూ.5,18,000 విలువైన విద్యుత్‌ ఆదా అయింది. తిరుమల తరహాలో క్యాంపస్‌ మొత్తాన్ని పచ్చదనంతో నింపాలి. ప్రపంచంలోని వివిధ రకాల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ నాటాలి. పెరుగుతున్న ఎండలు, వాతావరణ మార్పులను తట్టుకునేలా చేయాలి. హైదరాబాద్‌ తరహాలో ఇక్కడ కూడా పచ్చదనం అభివృద్ధి చేయాలి. హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే తడి చెత్త, ఆకులను కంపోస్టుగా మార్చాలి. వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ తయారు చేసి వంట గదులకు ఉపయోగించాలి. రీసైక్లింగ్‌కు పనికొచ్చే వ్యర్థాలను వేరు చేసి పంపాలి. దేనికీ పనికిరాని చెత్త కోసం ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌ ఉపయోగించాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. క్యాంపస్‌ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోకూడదు. శుద్ధి చేసిన నీటిని చెట్లకు ఉపయోగించాలి. పైప్‌ల ద్వారా వచ్చే గ్యాస్‌తో వంటలు చేయాలి. వంటల కోసం ఎలక్ట్రిక్‌ స్టవ్‌లు లేదా PNG గ్యాస్ మాత్రమే వాడాలి. ప్రొఫెసర్లు, నిపుణులతో కూడిన కమిటీ వేసి ఇన్-హౌస్ నాలెడ్జ్ ఉపయోగించుకోవాలి. ప్రతి విద్యార్థి ఐడియాలను తీసుకుని యాక్షన్ ప్లాన్‌లో భాగస్వామ్యం చేయాలి. ప్రపంచంలోనే టాప్ 10 లేదా టాప్ 20 నాలెడ్జ్ యూనివర్సిటీల సరసన ఏయూను నిలపాలి. క్యాంపస్ లోపల ఎలక్ట్రికల్ సైకిళ్లను అందుబాటులోకి తేవాలి. సైక్లింగ్ ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా ఫిట్‌నెస్ పెరుగుతుంది”

నెట్‌ జీరో లక్ష్యాల సాధనలో భాగంగా క్యాంపస్‌ నుంచి ప్రారంభించిన చర్యలను మరింత విస్తృతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. విద్యార్థుల ఆలోచనలను సేకరించి కార్యాచరణ ప్రణాళికలో భాగం చేయాలని, ప్రొఫెసర్లు, నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి జ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమం అనంతరం నెట్‌ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవొటెల్ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్‌పై ప్రయాణించారు. విశాఖలోని ఏయూ నుంచి నోవొటెల్ హోటల్ వరకు సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరాన్ని 21.18 నిమిషాల్లో ఆయన పూర్తి చేశారు. త్రి టౌన్ పోలీస్ స్టేషన్ పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్ కు చేరుకున్నారు. తీవ్ర ఎండ ఉన్నప్పటికీ మార్గమంతా ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం సైకిల్‌పై ముందుకు సాగారు. సైకిల్‌ ర్యాలీలో ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, శుభ్రత, శక్తి పొదుపు లక్ష్యాలతో ప్రభుత్వం చేపట్టనున్న చర్యలకు ఈ కార్యక్రమం నాంది పలికినట్టుగా అధికారులు పేర్కొన్నారు.