యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్‌. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. శనివారం విశాఖపట్నంలో ఏయూ కన్వెన్షన్ హాల్లో జేఎన్టీయూ జీవి ప్రథమ స్నాతకోత్సవం జరిగింది. 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ నజీర్, వీసీ వీవీ.సుబ్బారావు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈఓ మయూర్ పట్నాల, వివిధ యూనివర్శిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు.

విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకూడదు..

విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకూడదని గవర్నర్ వ్యాఖ్యానించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు, విద్యాసంస్థలదే కీలక పాత్ర అని తెలిపారు. జేఎన్‌టీయూ జేవీ క్యాంపస్‌లో ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

జల సంరక్షణ పటిష్ఠంగా అమలు చేస్తున్నారు..

క్యాంపస్‌లో జల సంరక్షణ పటిష్ఠంగా అమలు చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం, క్యాంపస్ అంతటా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా యూనివర్శిటీని 'నెట్ జీరో క్యాంపస్'గా మార్చేందుకు కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు. సమ్మర్ ఇంటర్న్స్‌గా సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హాస్టల్ బిల్డింగ్‌ల రిపేర్లు, రినోవేషన్ పనులను స్వయంగా పూర్తి చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ద్వారా సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలతో కూడిన విద్య అందుతుందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు.