చెన్నై (ప్యారిస్‌): తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్‌ బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చోరీకి పాల్పడ్డారనే అనుమానంతో వారిని ఇంట్లోనే నిర్బంధించినట్లు సమాచారం.

చెన్నై నీలాంగరై ప్రాంతంలో రవి మోహన్‌ నివాసం ఉంది. అక్కడ ఇంట్లో ఉన్న నగలు, నగదు చోరీ అయ్యాయని ఆయన అనుమానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని బయటకు వెళ్లనీయకుండా బంధించినట్టు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఘటనలో ఒక మహిళ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త అనుమానం వ్యక్తం చేశాడు. భార్య ఆలస్యంగా రావడంతో ఆమె భర్త నీలాంగరైలోని రవి మోహన్‌ ఇంటికి వెళ్లి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అక్కడికి వెళ్లినప్పుడు తన భార్యను ఇంట్లోనే బంధించి ఉంచినట్లు అతనికి తెలిసింది.

భార్యను ఇంటికి పంపాలని ఆమె భర్త రవి మోహన్‌ను కోరినప్పటికీ, నటుడు ఆమెను విడిచిపెట్టేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తి నీలాంగరై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే రవి మోహన్‌ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో పని చేసే మహిళలను, బాలుడిని బంధించడం సరికాదని ఆయనకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసులు ఆ ఇద్దరు మహిళలు, బాలుడిని అక్కడి నుంచి విడిపించారు.

ఇంట్లో జరిగిన చోరీ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే, పోలీస్‌ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేయాలని రవి మోహన్‌కు పోలీసులు సూచించారు. చోరీ అనుమానితులను స్వయంగా బంధించడం, నిర్బంధంలో ఉంచడం చట్టవిరుద్ధమని వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, చోరీ జరిగిందని అనుమానం ఉంటే చట్టపరమైన మార్గాలనే ఆశ్రయించాల్సిందని పోలీసులు సూచించినట్లు తెలిసింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. చోరీపై రవి మోహన్‌ అధికారికంగా ఫిర్యాదు చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.