రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రూపం మార్చుకొనే జీవి కథతో ‘ఒడియన్’ – మలయాళంలోకి ధర్మ ప్రొడక్షన్స్ ప్రవేశం
హారర్ శైలిలో వినూత్న ప్రయోగాలకు పేరుగాంచిన మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘భ్రమయుగం’, ‘డీయస్ ఈరే’ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ఇప్పుడు ‘ఒడియన్’ అనే కొత్త సినిమాను రూపొందించబోతున్నారు. ‘ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించారు.
ధర్మ ప్రొడక్షన్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కరణ్ జోహార్‌తో పాటు సుప్రియ మేనన్, అపూర్వ మెహతా తదితరులు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, నటి మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ వివరాలను కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఒక నోట్ రాశారు.
ధర్మమూవీస్ మలయాళ చిత్రసీమలోకి తొలి అడుగు వేస్తుంది. పృథ్వీ, మేము కలిసి ఎన్నో చిత్రాల కోసం పని చేశాము. భవిష్యత్తులో కూడా మరెన్నో రానున్నాయని ఆశిస్తున్నాం. అత్యంత ప్రతిభావంతుడు రాహుల్ సదాశివన్. జానపద కథల ఆధారంగా భయానకమైన కథనాన్ని చెప్పడంలో ఆయనకున్న నైపుణ్యం సినీ యుగంలో ఓ అద్భుతం.
ఈ నోట్‌తో పాటు ‘ఒడియన్’ టైటిల్ పోస్టర్‌ను కూడా కరణ్ జోహార్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. కేరళ పురాణాల్లో ప్రస్తావించే రూపం మార్చుకొనే ఓ జీవి చుట్టూ కథ తిరగనుందని, ఆ జీవి, శక్తిమంతమైన కుటుంబం, భ్రమల మధ్య జరిగే పోరాటం ఈ చిత్రానికి నేపథ్యంగా ఉండబోతోందని సినీ వర్గాల్లో సమాచారం.
రాహుల్ సదాశివన్ గత చిత్రాల్లోనూ జానపద అంశాలను, మానసిక భయాలను మేళవించి ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అదే శైలిని మరింత విస్తృత స్థాయిలో, పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ‘ఒడియన్’లో చూపించబోతున్నారని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ – మంజు వారియర్ కలయిక, ధర్మ ప్రొడక్షన్స్ ప్రవేశం, రాహుల్ సదాశివన్ హారర్ టచ్ కలిసివస్తుండటంతో ‘ఒడియన్’పై మలయాళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, నటీనటుల పూర్తి జాబితా, చిత్రీకరణ షెడ్యూల్ తదితరాలను త్వరలో ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.







