ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో రూపుదిద్దుకోబోతున్న కొత్త చిత్రంపై తమిళనాడులోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్టీకే) ప్రధాన సమన్వయకర్త, సినీ దర్శక–నటుడు సీమాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా కథ, కంటెంట్‌ గురించి చిత్రబృందం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వివరాల నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

కార్తికేయుడు తమిళుల దైవమని, ఆయన ఉత్తరాది రాష్ట్రంలో జన్మించారనే భావనకు బలం చేకూర్చేలా సినిమా నిర్మించే ప్రయత్నం జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని సీమాన్‌ హెచ్చరించారు. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తమిళుల దైవమైన కార్తికేయుడు ఉత్తరాదిలో జన్మించారనే భావనను బలపరిచేలా చిత్రబృందం కంటెంట్‌ను పోస్ట్‌ చేయడం దిగ్భ్రాంతికరమని ఆయన అభిప్రాయపడ్డారు.

కల్పనాత్మక సృజన పేరుతో కనీస అవగాహన లేకుండా చారిత్రక వాస్తవాలను వక్రీకరించి, వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్యగా సీమాన్‌ పేర్కొన్నారు. తమిళుల పురాతన సంస్కృతి, జీవన విధానంతో గాఢంగా ముడిపడిన సుబ్రహ్మణ్యస్వామి తమిళుల అతి ప్రాచీన ఆది దైవమని ఆయన గుర్తుచేశారు.

సుబ్రహ్మణ్యస్వామి ఉత్తరాదిలో జన్మించారనే కట్టుకథలను సృష్టించి, వాటిని కళ పేరిట వక్రీకరించేందుకు ప్రయత్నించడం తగదని సీమాన్‌ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను చిత్రబృందం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఇదే భావజాలంతో సినిమాను నిర్మించి విడుదల చేస్తే, తమిళనాడులోని ఏ థియేటరులోనూ ఆ చిత్రాన్ని ప్రదర్శించకుండా నామ్‌ తమిళర్‌ కట్చి భారీ స్థాయిలో పోరాటాలు చేపడుతుందని సీమాన్‌ తెలిపారు. ఈ చిత్రం తమిళ, తెలుగు వెర్షన్‌లను తమిళనాడులో ప్రదర్శించేందుకు అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

తమిళుల ఆధ్యాత్మిక విశ్వాసాలు, చారిత్రక నేపథ్యానికి విరుద్ధంగా కార్తికేయుని జననాన్ని చిత్రీకరించే ప్రయత్నం జరిగితే, అది కేవలం సినిమా పరిధిని దాటి సామాజిక–రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉందని సీమాన్‌ తన ప్రకటనలో స్పష్టం చేశారు.