రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్‌లో భీమవరం బుల్స్ జట్టు తొలిసారిగా విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మంగళగిరి గ్రామీణంలో ఏకపక్షంగా సాగిన ఈ తుదిపోరులో భీమవరం బుల్స్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు భీమవరం బౌలర్ల ధాటికి కంగుతింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. చెన్నుపాటి రవితేజ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, మోపాడ రవికిరణ్ 1 వికెట్ (4 ఓవర్లు, 20 పరుగులు), బైలపూడి యశ్వంత్ 1 వికెట్ (4 ఓవర్లు, 24 పరుగులు), హేమంత్ రెడ్డి 1 వికెట్ (3 ఓవర్లు, 17 పరుగులు), తోట శ్రావణ్ 1 వికెట్ (3 ఓవర్లు, 11 పరుగులు) తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.
వైజాగ్ లయన్స్ తరఫున త్రిపురణ విజయ్ మాత్రమే ప్రతిఘటించాడు. అతడు 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించాడు. వినయ్ కుమార్ 19, హిమకర్ 17, హనీశ్ రెడ్డి 15 పరుగులు చేసి రెండంకెల స్కోరు సాధించిన ఇతర బ్యాట్స్‌మెన్. మిగతా ఆటగాళ్లు భీమవరం బౌలింగ్ ముందు తేలిపోయారు.
139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భీమవరం బుల్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. రేవంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి జోడీ వైజాగ్ బౌలర్లను ఊపిరి తీసుకోనివ్వలేదు. రేవంత్ రెడ్డి 33 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి ప్రత్యర్థి ఆశలను చెరిపివేశాడు. మరో ఓపెనర్ హేమంత్ రెడ్డి 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ ఇద్దరి అజేయ భాగస్వామ్యంతో భీమవరం బుల్స్ జట్టు వికెట్ నష్టపోకుండా కేవలం 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడిన భీమవరం ఓపెనర్లు మ్యాచ్‌ను ఒకపక్షంగా మార్చేశారు.
ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విజేత భీమవరం బుల్స్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. విజేతలకు రూ.35 లక్షల ప్రైజ్ మనీ, రన్నరప్ సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు రూ.25 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు.
కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్, విశాఖపట్నం ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎల్ ఐదో సీజన్‌ను విజయవంతంగా ముగించేందుకు ఏసీఏ చేసిన ఏర్పాట్లను క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.







