మెక్సికోతో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌..

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ప్రిక్వార్టర్స్‌ దశకు చేరుకుంది. హేమాహేమీ జట్లు రౌండ్‌ ఆఫ్‌ 16 పోరులకు సన్నద్ధమవుతున్నాయి. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ జట్టు, సహ ఆతిథ్య దేశం మెక్సికోతో ప్రిక్వార్టర్స్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ను ముందుంచుకుని ఇంగ్లాండ్‌ జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది.

మెక్సికోతో జరగబోయే ఈ కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వయాగ్రా వినియోగానికి అనుమతి పొందారు. అక్కడి వాతావరణం, ముఖ్యంగా ఎత్తైన ప్రదేశం కారణంగా ఆటగాళ్ల శారీరక సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇంగ్లాండ్‌ – మెక్సికో మ్యాచ్‌ జూలై 6న ఎస్టాడియా అజ్టెకా స్టేడియంలో జరగనుంది. మెక్సికో సిటీలో ఉన్న ఈ మైదానం సముద్ర మట్టానికి దాదాపు 7,350 అడుగుల ఎత్తులో ఉంది. ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్లు త్వరగా అలసటకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు వయాగ్రా వినియోగం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

అయితే, ఇలాంటి ఔషధాల వినియోగానికి అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ, ఫిఫా నిర్వాహకుల అనుమతి తప్పనిసరి. తమ ఆటగాళ్లు వయాగ్రా వాడేందుకు అనుమతి ఇవ్వాలని ఇంగ్లాండ్‌ మేనేజర్‌ థామష్‌ టచెల్‌ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీనిపై ఫిఫా నుంచి అనుమతి లభించడంతో ఇంగ్లాండ్‌ జట్టుకు మార్గం సుగమమైంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మెక్సికో జట్టు అజేయంగా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లన్నింటిలోనూ విజయం సాధించింది. అజ్టెకా స్టేడియం మెక్సికోకు అదృష్ట మైదానంగా పేరుపొందింది. ఇక్కడ సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆ జట్టు మరింత దూకుడుగా ఆడుతుంది.

ఈ స్టేడియంలో ఇప్పటి వరకు మెక్సికో 89 మ్యాచ్‌లు ఆడగా, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి చవిచూసింది. అదీ చివరిసారిగా 2013లో. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు మెక్సికోను వారి సొంత మైదానంలో ఓడించడం పెద్ద సవాలుగా మారింది.

టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ వద్ద మెక్సికోను ఎదుర్కొనే వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే ఆటేతర అంశాలు, ముఖ్యంగా ఎత్తైన ప్రదేశం ప్రభావం ఆటపై పడకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వయాగ్రా వినియోగానికి అనుమతి తీసుకున్నట్లు క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.