రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు షాక్.. దొంగిలించిన సామగ్రి 24 గంటల్లో రికవరీ
ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకు అనూహ్య ఘటన ఎదురైంది. జట్టు ఆటగాళ్ల బూట్లు, సాధన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. అయితే స్థానిక పోలీసులు వేగంగా స్పందించి 24 గంటల వ్యవధిలోనే ఆ సామగ్రిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
ఇంగ్లండ్ జట్టు ఫ్లోరిడాలోని శిక్షణ శిబిరం నుంచి మిస్సోరికి ప్రయాణిస్తుండగా ఈ చోరీ జరిగినట్లు సమాచారం. ప్రపంచ కప్ బేస్ క్యాంప్‌కు జట్టు తరలింపులో భాగంగా ప్లేయర్లు ఒక వాహనంలో ప్రయాణిస్తుండగా, వారికి సంబంధించిన విలువైన సాధన సామగ్రి మరో వాహనంలో వెళ్తోంది. అదే వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు సామగ్రిని అపహరించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా ముస్తఫా సాలీక్, ఎర్ఫాన్ కమల్ అనే ఇద్దరిని అనుమానితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్ ప్లేయర్ల సాధన సామగ్రి దొంగతనానికి వీరే బాధ్యులని పోలీసులు తెలిపారు.
అనుమానితులపై సంబంధిత నేర నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. దోషులుగా తేలితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదనంగా, కోర్టు ఆ ఇద్దరికి 75 వేల డాలర్లు చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిలో తొమ్మిది జతల ఫుట్‌బాల్ బూట్లు, గోల్‌కీపర్ గ్లవ్స్, ప్రపంచ కప్ మ్యాచ్ బాల్, శిక్షణ దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటగాళ్ల సంతకాలతో ఉన్న జెర్సీలు ఉన్నాయని వెల్లడించారు. అయితే జట్టు మ్యాచ్‌లకు అత్యవసరంగా ఉపయోగించే ముఖ్యమైన సామగ్రి మాత్రం ఈ చోరీలో భాగం కాలేదని స్పష్టం చేశారు.
సామగ్రి రికవరీ కావడంతో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ సిద్ధతల్లో అంతరాయం పెద్దగా కలగలేదని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఈ నెల 18న క్రొయేషియా జట్టుతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులు, జట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.







