రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టిన మెస్సీ…
అర్జెంటీనా ఘన విజయం
ఫిఫా ప్రపంచ కప్ 2026ను డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్-జె లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ గోల్స్‌తో మెస్సీ ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోజ్‌తో సమానంగా నిలిచాడు. ఇద్దరూ కలిపి 16 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి తన గ్రూప్‌లో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
మెస్సీకి ఇది ఆరో ఫిఫా ప్రపంచ కప్. ఇదే సమయంలో అల్జీరియాతో జరిగిన ఈ పోరు అతని 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే మెస్సీ దూకుడు ప్రదర్శించాడు. మైదానమంతా చురుగ్గా కదిలి ప్రత్యర్థి రక్షణను ఒత్తిడికి గురి చేశాడు.
ఆట 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ ట్రాప్‌ను ఛేదిస్తూ వచ్చిన బంతిని మెస్సీ గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి గోల్‌తో ఉత్సాహం పెంచుకున్న అర్జెంటీనా దాడులను మరింత వేగవంతం చేసింది.
రెండోార్థంలో కూడా మెస్సీ తన దూకుడును కొనసాగించాడు. ఆట 60వ నిమిషంలో రైట్ కార్నర్ నుంచి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరోసారి గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు చేరింది.
69వ నిమిషంలో అల్జీరియాకు గోల్ చేసే మంచి అవకాశం లభించినా దాన్ని వారు వృథా చేసుకున్నారు. ఆ తర్వాత కూడా అర్జెంటీనా రక్షణ పటిష్ఠంగా నిలిచి ప్రత్యర్థికి మరిన్ని అవకాశాలు ఇవ్వలేదు.
76వ నిమిషంలో మెస్సీ మూడోసారి గోల్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని గోల్ సాధించాడు. దీంతో అతను హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు ప్రపంచ కప్‌లో తన తొలి హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ గోల్‌తో అర్జెంటీనా విజయం దాదాపు ఖరారైంది.
మొత్తం మ్యాచ్‌లో ఎక్కువ సమయం బంతి అర్జెంటీనా ఆధీనంలోనే ఉండింది. దూకుడుతో ఆడిన అర్జెంటీనా ముందు అల్జీరియా జట్టు పెద్దగా ప్రతిఘటన చూపలేకపోయింది. దాడి, రక్షణ రెండింటిలోనూ అర్జెంటీనా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.







