రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: మాంచెస్టర్‌లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఘన ఆరంభం చేసింది. దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, బౌలింగ్‌లో ముఖ్యంగా స్పిన్ విభాగం అంచనాలకు మించి రాణించింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని అందించింది. చివర్లో రిచా ఘోష్ 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 పరుగులు బాదడంతో భారత్ పోటీకి తగిన స్కోరు దాటింది.
పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా, సాదియా చెరో రెండు వికెట్లు తీశారు. తస్మియా, రమీన్ షమీమ్‌లకు చెరో వికెట్ దక్కింది. భారత్ ఇన్నింగ్స్‌లో షఫాలీ వర్మ తొలి బంతినే సిక్సర్‌గా మలిచినప్పటికీ 6 పరుగులకే అవుటైంది. జెమీమా 1 పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ దశలో భారత్ ఒత్తిడిలో పడినా, మంధాన–హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గాడిలో పెట్టారు.
పవర్‌ప్లేలో భారత్ 38 పరుగులకే పరిమితమైంది. పాకిస్థాన్ బౌలర్లు పరుగులను కట్టడి చేయడంతో మధ్య ఓవర్లలో కూడా రన్‌రేట్ పెద్దగా పెరగలేదు. 16 నుంచి 18 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదు. 150 పరుగులు కూడా కష్టమేననిపించిన వేళ 19వ ఓవర్‌లో రిచా ఘోష్ వరుసగా 4, 4, 6, 4, 4 బాదడంతో ఒక్క ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో మరో 15 పరుగులు చేరడంతో భారత్ స్కోరు 170కి చేరింది. పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్ భారత్‌కు అదనపు లాభం చేకూర్చింది. మంధాన ఇచ్చిన రెండు క్యాచ్‌లను వారు వదిలేశారు.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మునీబా 35 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసి ప్రతిఘటించింది. ఫిరోజా, ఆయేషా చెరో 12 పరుగులు, ఆలియా రియాజ్ 18 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు భారత స్పిన్నర్లకు తలొగ్గారు.
భారత్ తరఫున దీప్తి శర్మ 4 ఓవర్లలో 10 పరుగులకే 5 వికెట్లు తీసి పాకిస్థాన్ బ్యాటింగ్‌ను చిత్తుచేసింది. శ్రీచరణి 4 ఓవర్లలో 21 పరుగులకు 3 వికెట్లు పడగొట్టింది. షఫాలీ ఒక వికెట్ తీసింది. మధ్య ఓవర్లలో దీప్తి, శ్రీచరణి జంటగా దాడి చేయడంతో పాకిస్థాన్ లయ కోల్పోయింది. 31 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోవడం వారి పతనానికి నిదర్శనం.
ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె రికార్డు మరింత బలపడింది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ 762 పరుగులతో మిథాలీని అధిగమించింది. హాఫ్ సెంచరీల సంఖ్యలో మిథాలీ, హర్మన్‌ల సరసన మంధాన చేరింది. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా మంధాన, హర్మన్‌ప్రీత్‌ను దాటింది.







