ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా భారత్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య రెండు టీ20ల సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీమ్‌ఇండియా తుది పదకొండు కూర్పు ఎలా ఉండబోతోందన్నది క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైభవ్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి దింపేందుకు ఎవరిని పక్కన పెట్టాల్సి వస్తుందన్నది టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది.

ఓపెనింగ్‌ స్థానంలోనే వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లోనూ అతడు ఎక్కువగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినవాడే. మరో ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ లేదా సంజు శాంసన్‌లో ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సంజు శాంసన్‌ మిడిలార్డర్‌లో కూడా సౌకర్యంగా బ్యాటింగ్‌ చేయగలడు. అయితే అభిషేక్‌ శర్మ ఎక్కువగా ఓపెనింగ్‌ స్థానానికే పరిమితమవుతాడు. ఈ నేపథ్యంలో ఓపెనింగ్‌ స్థానాల కోసం జరిగే కుర్చీలాటలో ఒకరిని బెంచ్‌కే పరిమితం చేయడం లేదా బ్యాటింగ్‌ క్రమాన్ని మార్చడం తప్పనిసరి కానుంది.

ప్రస్తుతం అభిషేక్‌ శర్మ టీ20ల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కేవలం 46 ఇన్నింగ్స్‌ల్లోనే 1,438 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్‌రేట్‌ 190కు పైగానే ఉంది. మరోవైపు గత టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన సంజు శాంసన్‌ ఇప్పుడు టీమ్‌ఇండియా రెగ్యులర్‌ సభ్యుడిగా స్థిరపడ్డాడు. తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 62 మ్యాచ్‌లు ఆడి 1,399 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండగా, అతడి స్ట్రైక్‌రేట్‌ 156.84.

ఇషాన్‌ కిషన్‌ ఇటు ఓపెనర్‌గా, అటు వన్‌డౌన్‌తో పాటు మిడిలార్డర్‌లోనూ బ్యాటింగ్‌ చేయగలడు. ఇప్పటి వరకు 45 టీ20ల్లో 1,328 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 10 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 148.05. ఓపెనింగ్‌లో ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో మిడిలార్డర్‌లోనూ ఉత్కంఠ తక్కువేమీ కాదు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎక్కువగా సెకండ్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. ఇషాన్‌ కిషన్‌ వన్‌డౌన్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి.

వైభవ్‌, అభిషేక్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే సంజు శాంసన్‌ బ్యాటింగ్‌ క్రమాన్ని తప్పక మార్చాల్సి వస్తుంది. అలా చేస్తే ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ల తర్వాతే సంజుకు స్థానం దొరకే అవకాశం ఉంటుంది. లేకపోతే సంజు లేదా అభిషేక్‌లో ఒకరిని బెంచ్‌కే పరిమితం చేస్తే, ప్రస్తుత బ్యాటింగ్‌ క్రమంలో పెద్దగా మార్పులు అవసరం ఉండకపోవచ్చు.

ఆల్‌రౌండర్ల విభాగంలో అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, సూర్యాంశ్‌ షెడ్జేలో ఇద్దరిని మాత్రమే తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్‌ విభాగానికి వస్తే, ఐర్లాండ్‌ పర్యటన కోసం భారత్‌ నలుగురు ప్రధాన పేసర్లు, ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేస్‌ ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌తో కూడిన బౌలింగ్‌ దళాన్ని ఎంపిక చేసింది.

స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్‌కు తుది జట్టులో స్థానం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మిగతా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణాతో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రిన్స్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణల్లో ఒకరికి మాత్రమే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లే రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటనకు భారత తుది జట్టులో స్థానం దక్కించుకునే అవకాశముందని క్రికెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తుది జట్టు (అంచనా): వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌/అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌/ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్.