ఒక కొత్త ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం, రెండు మూడు సిరీస్‌ల పాటు బెంచ్‌పైనే కూర్చోబెట్టడం, ఆ తర్వాత ఎప్పుడో అవకాశం ఇవ్వడం – ఇదే టీమ్‌ఇండియా యాజమాన్యం ఎన్నాళ్లుగానో అనుసరిస్తున్న విధానం. కొత్తగా వచ్చిన కుర్రాళ్లను నేరుగా బరిలోకి దించితే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, డ్రెస్సింగ్‌ రూంలో వాతావరణం, అంతర్జాతీయ మ్యాచ్‌ల ఉత్కంఠకు అలవాటు కావడానికే ఈ పద్ధతి అనుసరిస్తున్నామని జట్టు వర్గాలు వివరిస్తుంటాయి.

అయితే ప్రస్తుతం టీ20 జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లలో చాలా మంది ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా రాటుదేలి వస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూంను పంచుకోవడం, తీవ్ర ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ పరిస్థితుల్లో ఆడడం వంటి అనుభవం వారికి ముందే ఉంది. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ ఇదే ప్రక్రియ అవసరమా అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానులు, విశ్లేషకుల మధ్య చర్చనీయాంశమైంది.

ఈ చర్చకు తాజా కారణం యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి ఎంపికై సంచలనం రేపిన వైభవ్‌.. ఆ జట్టుపై అరంగేట్రం చేసే అవకాశం మాత్రం పొందలేకపోయాడు. తొలి టీ20లో అతడి ఆటను ప్రత్యక్షంగా చూడాలని బెల్‌ఫాస్ట్‌ స్టేడియాన్ని ముంచెత్తిన భారత అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. రెండో మ్యాచ్‌లో అయినా అతణ్ని ఆడిస్తారేమోనని ఆశించినా, ఆ మ్యాచ్‌లో కూడా అతడికి అవకాశం రాలేదు.

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన టీమ్‌ఇండియా, పసికూన ఐర్లాండ్‌కు సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయి పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో వైభవ్‌ను ఆడించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంజు శాంసన్, ఇషాన్‌ కిషన్‌లలో ఒకరిని పక్కన పెట్టి కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా ఈ కుర్రాడికి అవకాశం ఇవ్వాల్సిందని క్రికెట్‌ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మేటి బౌలర్లను వైభవ్‌ ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అందరికీ తెలిసిందే. పేరుమోసిన బ్యాటర్లను వెనక్కి నెట్టి టోర్నీలో టాప్‌స్కోరర్‌గా నిలవడం అతడి ప్రతిభకు నిదర్శనం. ఐపీల్ తర్వాత ఇండియా -A తరఫున శ్రీలంక పర్యటనలోనూ రాణించిన వైభవ్‌.. గొప్ప ఆత్మవిశ్వాసంతో యునైటెడ్ కింగ్డమ్ పర్యటనకు చేరాడు. అలాంటి ఫామ్‌లో ఉన్న ఈ యువ బ్యాట్స్‌మన్‌ను వెంటనే బరిలోకి దించి ఉంటే సిరీస్‌ ఫలితమే వేరుగా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు బుధవారం నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభంకానున్న అయిదు టీ20ల సిరీస్‌లో అయినా వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం కల్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. యువ ప్రతిభను సమయానికి వినియోగించుకోవాలా, లేక పాత విధానాన్నే కొనసాగించాలా అన్న దానిపై టీమ్‌ఇండియా యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై అందరి చూపు నిలిచింది.