రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే వారిపై, ఓటర్లను బెదిరించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి, అవసరమైతే అరెస్టులు చేస్తామని ఆయన హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులతో అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలు, పోలీసు ఆంక్షలపై స్పష్టమైన సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ధర్మవరం పట్టణ డిఎస్పీ జగన్నాథరాజు, సిఐలు రెడ్డప్ప, జయ నాయక్, ఎస్ఐలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ధర్మవరం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఓటర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఓటు హక్కు వినియోగంపై ఒత్తిడి తీసుకురావడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం, అల్లర్లు సృష్టించడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీసు చట్టం నిబంధనలను ఎవరూ ఉల్లంఘించరాదని ఆయన సూచించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అనవసరంగా రోడ్లపై, టీ దుకాణాల వద్ద, ఇతర కూడళ్లలో గుంపులుగా గుమిగూడకుండా ఉండాలని, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అవసరమైన మేరకు అరెస్టులు చేయడంలో ఎలాంటి వెనుకడుగు ఉండదని అడిషనల్ ఎస్పీ తెలిపారు. పదేపదే నేరాలకు పాల్పడే వ్యక్తులు, ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నవారి నేర చరిత్రను పరిశీలించి, నిబంధనల ప్రకారం రౌడీషీట్లు తెరవనున్నట్టు హెచ్చరించారు.
ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అనుచరులకు తగిన సూచనలు ఇవ్వాలని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టానికి అతీతులు కాదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు పూర్తిగా సహకరించి ధర్మవరం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ పిలుపునిచ్చారు.













