పుట్టపర్తి అభివృద్ధికి కూటమి అభ్యర్థులే బలమైన ఆధారం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. రాబోయే పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రజలు తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు.

పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రచారంలో భాగంగా నిర్వహించిన ముగింపు ర్యాలీకి ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తల నుంచి అపూర్వ స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో పుట్టపర్తి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.

2019 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందని ఎమ్మెల్యే విమర్శించారు. అవినీతి, అక్రమాలు, ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. లిక్కర్ స్కామ్, రుషికొండ ప్యాలెస్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మార్పు కోరుకున్న ప్రజలు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో కూటమికి అఖండ విజయాన్ని అందించారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పల్లె సింధూర రెడ్డి వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.4,000, రూ.6,000, రూ.15,000 వరకు పింఛన్లు అందించడం, తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20,000 ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న అభివృద్ధి పెట్టుబడుల్లో 28 శాతం రాష్ట్రానికి రావడం ఆయన నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

పుట్టపర్తి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పలు కీలక ప్రాజెక్టులు రాబోతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. దేశ రక్షణ రంగానికి అవసరమైన యుద్ధ విమానాల తయారీ కేంద్రం, DRDO AMCA ప్రాజెక్టు పుట్టపర్తి ప్రాంతానికి రావడం గర్వకారణమని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పుట్టపర్తి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

పుట్టపర్తి మండలంలోని పెడబల్లి సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న మహాజన్ ఇండస్ట్రీస్ జీన్స్ తయారీ యూనిట్ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని చెప్పారు. సుమారు రూ.51,300 కోట్ల పెట్టుబడితో, 31,750 ఎకరాల విస్తీర్ణంలో 6,600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న రిలయన్స్ సోలార్ ప్రాజెక్టు పుట్టపర్తి అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆమె వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో 2,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి, వ్యాపారులకు అవకాశాలు పెరిగి పుట్టపర్తి ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మహాభారతంలో అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లుగా, పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తున్నప్పుడు ప్రజల దృష్టి కూటమి అభ్యర్థుల గుర్తులపైనే ఉండాలని పిలుపునిచ్చారు.

నవంబర్ 1న జరగనున్న పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 28 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులకు కేటాయించిన సైకిల్, గ్లాస్, కమలం గుర్తులపై ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు. జనసేన పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ మేకల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించి పుట్టపర్తి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజలను అభ్యర్థించారు.

తనకు, తన కుటుంబానికి పుట్టపర్తి ప్రజలు అందించిన ఆదరణ, అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో పుట్టపర్తిని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.