రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి చేసిన ఆరోపణలపై బత్తల పల్లి సీఐ ప్రభాకర్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. తాను రాజకీయ నాయకుడు కాదని, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.
వైసీపీ కార్యకర్తలే తమను కాపాడాలని కోరిన నేపథ్యంలో, ప్రాణాలకు తెగించి తన వాహనంలో తీసుకెళ్లి నామినేషన్లు వేయించానని ఆయన వివరించారు. ఆ సమయంలో రాయి తగిలిన ఘటనను గుర్తుచేసుకున్నారు. హెల్మెట్ లేకుంటే తలకు తీవ్ర గాయం జరిగే ప్రమాదం ఉండేదని చెప్పారు.
తనపై లంచం తీసుకున్నారనే ఆరోపణల విషయంలో కేతిరెడ్డి వెంకటరామి రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే తాను లంచం తీసుకున్నట్లు కోర్టులో నిరూపించాలని ఆయన సవాలు చేశారు. నిరూపించలేని పక్షంలో క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
“నేను రాజకీయ నాయకుడిని కాదు.. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని”
తన సేవలపై అనుమానం వ్యక్తం చేసేలా ఆరోపణలు చేయడం సరైంది కాదని సూచించారు. చట్టపరంగా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆరోపణలు నిరాధారమైతే, వాటిని చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.













