రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
మహిళల భద్రతకు
సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్
చెన్నై: మహిళల భద్రతను బలోపేతం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం అధికారికంగా ప్రారంభించారు.
రాజరాతినం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సింగప్పెన్ దళానికి ప్రత్యేకంగా రూపొందించిన చిహ్నాన్ని ముఖ్యమంత్రి విజయ్ ఆవిష్కరించారు. ఈ బృందాల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన గస్తీ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఒక గస్తీ వాహనాన్ని నడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి నేరాలకు శిక్షలు కూడా కఠినంగా అమలు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు.
సింగప్పెన్ బృందం రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక సదుపాయాలతో పని చేయనుందని, ముఖ్యంగా డ్రోన్లను విస్తృతంగా వినియోగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీఎం తెలిపారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడ మహిళలను వేధించినా వెంటనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. ఈ తరహా ఏర్పాట్లు దేశంలోనే తొలిసారిగా తమిళనాడులో అమలవుతున్నాయని ఆయన అన్నారు.
నేరాల అదుపుకు డ్రగ్స్ నిర్ములించాలి..
రాష్ట్రంలో డ్రగ్స్‌కు అలవాటు పడిన వారే ఎక్కువగా మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి విజయ్ అభిప్రాయపడ్డారు. మహిళలపై నేరాల పెరుగుదలకూ, మాదకద్రవ్యాల వ్యాప్తికీ స్పష్టమైన సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల బెడదను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యను చాలాకాలంగా నిర్లక్ష్యం చేయడం వల్ల అది బలంగా వేళ్లూనుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్లక్ష్యానికి ఎవరు కారణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు.
సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోసం తొలి దశలో రూ.354 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ వెల్లడించారు. రెండో దశలో కొత్త యూనిట్ కోసం 2,500 కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోలీస్ పరేడ్‌లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని దళాన్ని పరిశీలించారు. మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.







