వచ్చే పదేళ్లలో ఏఐ సామ్రాజ్యం రూ. 450 లక్షల కోట్ల వ్యాపారం

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా మలుస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకుపోతున్న ఎకానమీ వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్‌ డాలర్లకు సమానమైన వ్యాపార అవకాశాలను సృష్టించబోతోందని ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ. 450 లక్షల కోట్లకు సమానం. ఈ ఎకోసిస్టమ్‌లో పుట్టుకొచ్చే, ఎదిగే కంపెనీల మార్కెట్‌ విలువ మాత్రం ఈ వ్యాపార పరిమాణానికి వందరెట్లకు పైగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచం చూస్తున్న అతిపెద్ద నిర్మాణాత్మక మార్పు ఇదేనని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏఐ అనగానే చాట్‌బోట్లు, సాఫ్ట్‌వేర్‌ ఆటోమేషన్‌ మాత్రమే గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్‌, వ్యవసాయం, లాజిస్టిక్స్‌, డిఫెన్స్‌, శాస్త్రీయ పరిశోధన వంటి దాదాపు అన్ని రంగాలకు ఏఐ వెన్నెముకగా మారుతోంది.

ఇప్పటి పోటీ మెరుగైన ఏఐ మోడల్‌ను తయారు చేయడానికే పరిమితం కాలేదు. మొత్తం ఏఐ వ్యవస్థను – దాని కోసం అవసరమైన హార్డ్‌వేర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లాట్‌ఫామ్‌లు, మోడళ్లను, అప్లికేషన్లను, స్వతంత్ర వ్యవస్థలను – తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వాలు, కార్పొరేట్‌ దిగ్గజాలు ముందుకు సాగుతున్నాయి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్‌ ఇన్‌ఫ్రా, డిజిటల్‌ ట్విన్స్‌, అటానమస్‌ సిస్టమ్స్‌, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్‌ వరకు ఈ రంగంలో ఎవరి చేతుల్లో ఎక్కువ నైపుణ్యం, సామర్థ్యం ఉంటుందన్నదే భవిష్యత్‌ నియంత్రణాధికారాన్ని నిర్ణయించనుంది.

ఈ ఆధిపత్య పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పెద్ద కంపెనీలు బిలియన్ల డాలర్ల పెట్టుబడులను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల నిర్మాణాన్ని మార్చటంతో పాటు పూర్తిగా కొత్త పరిశ్రమలను సృష్టించే సామర్థ్యం ఏఐకు ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి అదనంగా 15 ట్రిలియన్‌ డాలర్లను ఏఐ జోడించగలదని వారి అంచనా.

ఈ నేపథ్యంలో ఏఐ సామ్రాజ్యం ప్రధానంగా ఆరు పెద్ద విభాగాలుగా విస్తరిస్తోంది. మొదటిది ‘చిప్‌ అండ్‌ సిలికాన్‌’ – సెమీ కండక్టర్లు, GPUలు, నెట్‌వర్కింగ్‌ సిలికాన్‌ వంటి హార్డ్‌వేర్‌ భాగాలు. రెండోది ‘ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ – సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్‌ వ్యవస్థలు, విద్యుత్‌ సరఫరా. మూడోది ‘క్లౌడ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌’ – కంప్యూటింగ్‌, క్లౌడ్‌ సేవలు, మెషీన్‌ లెర్నింగ్‌ ఆపరేషన్స్‌, హోస్టింగ్‌.

నాలుగో విభాగం ‘ఫౌండేషన్‌ మోడల్స్‌’ – భారీ ఏఐ మోడళ్ల అభివృద్ధి, ట్రెయినింగ్‌, నిరంతర మెరుగుదల. ఐదోది ‘ఏఐ అప్లికేషన్లు’ – ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితర రంగాల్లో ఉపయోగాలు. ఆరోది ‘ఏఐ ఏజెంట్లు అండ్‌ అటానమీ’ – స్వతంత్ర వ్యవస్థలు, ఏఐ ఏజెంట్లు, రోబోటిక్స్‌.

ఈ మొత్తం ఎకోసిస్టమ్‌ను చుట్టూ ప్రపంచ దిగ్గజ కంపెనీలు, స్టార్టప్‌లు, టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు తమ వ్యూహాలను మలుచుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, పాలసీ నిర్ణయాధికారులు, పరిశ్రమల నాయకులు – అందరూ ఏఐ సామ్రాజ్య స్వరూపాన్ని అర్థం చేసుకుని తమ తమ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.