రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: హైదరాబాద్ మణికొండలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. మణికొండలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రేయ అనే విద్యార్థిని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనలో ఆమె రాసిన సూసైడ్ నోట్లో కాలేజీ ఫ్యాకల్టీ వేధింపుల గురించి చేసిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శ్రేయ ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో నిర్వహించిన పరీక్షల్లో, తనకు తెలియకుండానే పరీక్షా హాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన ఫ్యాకల్టీ, ఆమె ఎంతగానో బతిమాలినా, పొరపాటున జరిగిందని చెప్పినా, వినకుండా పరీక్షల నుంచి డీబార్ చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఆ ఘటనతో సమస్య ముగిసిపోక, సెకండ్ ఇయర్ ప్రారంభమైన తర్వాత నుంచి కాలేజీ సిబ్బంది శ్రేయను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తరగతి గదిలో, కాలేజీలో ఆమెను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తూ, ఎత్తిపొడుపు మాటలతో మానసికంగా వేధించారని వారు చెబుతున్నారు.
శ్రేయ రాసిన సూసైడ్ నోట్లో ఈ వేధింపుల వివరాలు ఉన్నాయి. ఒక అధ్యాపకురాలు తరగతి గదిలో అందరి ముందూ తనపై ఎలా మాట్లాడేదో, మరొక ఫ్యాకల్టీ ఎగ్జామ్స్ సందర్భంలో ఎలా ఎత్తిపొడిచేవారో ఆమె నోట్లో పేర్కొంది.
‘‘నీకు సిగ్గు, శరం ఉండవు.. కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవు’’
అని ఓ అధ్యాపకురాలు క్లాస్‌లో అందరి ముందూ దారుణంగా మాట్లాడేదని శ్రేయ నోట్లో వివరించింది.
‘‘ఈసారి ఎగ్జామ్స్‌లో నువ్వే దొరుకుతావని అనుకుంటే, వేరేవాళ్లు దొరికారు’’
అంటూ నిత్యం ఎత్తిపొడుపు మాటలతో వేధించేవారని ఆమె పేర్కొంది. గత మూడు నెలలుగా కాలేజీలో నిరంతరం జరుగుతున్న అవమానాలు, సూటిపోటి వ్యాఖ్యలను భరించలేక చివరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నోట్లో వెల్లడించింది.
‘‘అమ్మ, నాన్న.. నన్ను క్షమించండి, నేను చనిపోతున్నా. కాలేజీలో వేధింపులు నేను భరించలేకపోతున్నా.. నా చావు వార్త కాలేజీ వాళ్లకు తెలియనివ్వకండి.. నా చావు చూసి వాళ్లు బాధపడరు.. సంతోషిస్తారు’’
అని ఆమె రాసిన వ్యాఖ్యలు చదివిన వారందరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి.
సూచన అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, శ్రేయ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశించిన కూతురు ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తమ కూతురు మరణానికి కారణమైన వాసవి ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రేయ సూసైడ్ నోట్లో చేసిన ఆరోపణల దిశగా కూడా విచారణను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.







