నల్లగొండలో డబుల్ డెత్ మిస్టరీ:

ఎంబీబీఎస్ విద్యార్థిని, యువకుడు అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ప్రాంతంలో కలకలం రేగింది. మొదట సాధారణ ఆత్మహత్యలుగా కనిపించిన ఈ రెండు ఘటనలు, కుటుంబ సభ్యుల ఆరోపణలు, రక్తంతో రాసిన సందేశం వెలుగులోకి రావడంతో డబుల్ డెత్ మిస్టరీగా మారాయి. కేసు వివిధ కోణాల్లోకి మలుపు తిరుగుతుండటంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

మునుకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న, సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతోంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. యువతి మృతి వార్త గ్రామంలో వేగంగా వ్యాపించి తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనకు కొన్ని గంటల వ్యవధిలోనే అదే గ్రామానికి చెందిన చరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ ప్రసన్న మృతి విషయం తెలిసిన తర్వాత చరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి గ్రామ శివారులోని తాటి చెట్టుకు ఉరివేసుకుని అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఒకే గ్రామంలో, ఒకే రాత్రి రెండు యువ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామం అంతటా దిగ్భ్రాంతి నెలకొంది.

లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో కేసు కీలక మలుపు తిరిగింది. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, ఆమెను చరణ్ హత్య చేశాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చరణ్ వేధింపుల వల్లే లక్ష్మీ ప్రసన్న ప్రాణాలు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఆత్మహత్యకు ముందు చరణ్ చేసిన పని కేసులో మరింత ఉత్కంఠ రేపుతోంది. తన తండ్రి సమాధిపై స్వయంగా రక్తంతో కొన్ని పేర్లు రాసినట్లు పోలీసులు గుర్తించారు. రక్తంతో రాసిన ఆ పేర్లు, సందేశం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై దర్యాప్తు సాగుతోంది. ఈ పరిణామంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది.

మొదట ఆత్మహత్యలుగా కనిపించిన ఈ రెండు ఘటనల్లో ఇతర కోణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు సవివరంగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చరణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ డబుల్ సూసైడ్ ఘటనపై మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, చాటింగ్ వివరాలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నామని ఎస్సై రవీందర్ పేర్కొన్నారు. రెండు మరణాల వెనుక నిజానిజాలు వెలికితీయడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.