రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
అభివృద్ధిలో రాజకీయం వద్దు..
కేంద్రంతో చర్చలతోనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి, ప్రజల ప్రయోజనాల కోసం తాను పునపునా ఢిల్లీకి వస్తున్నానని ఆయన తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు, చర్చల ద్వారానే ముందుకు సాగుతున్నామని సీఎం పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా వరంగల్ మమూనూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణంపై కేంద్రంతో కీలక చర్చలు జరిగినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రెండు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణను 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో ప్రాంతీయ ఎయిర్ పోర్టుల అభివృద్ధి అత్యంత కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.
మమూనూరు ఎయిర్ పోర్టు పనుల పురోగతిపై వివరాలు తెలియజేస్తూ, 2028 జూన్ 2 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని గడువు విధించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం 253 ఎకరాల భూమిని సేకరించి ఇప్పటికే Airport Authorityకి అప్పగించినట్లు ఆయన వివరించారు. మరో మూడు, నాలుగు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుందని సీఎం తెలిపారు.
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1500 ఎకరాల భూమిని కేటాయించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టులను కేంద్రంతో సమన్వయంతో వేగంగా ముందుకు తీసుకెళ్లేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ పోర్టుల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు జోక్యం చేసుకోకూడదని, ప్రజల ప్రయోజనాలే తమకు ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హైలైట్ చేశారు. కేంద్రంతో సమన్వయంతోనే రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను సాధించుకుంటామని, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.







