తిరుపతిలో రాజకీయ వేడి

వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ.. ఎన్డీయే విజయోత్సవ సభ

తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, అదే రోజున అధికార ఎన్డీయే కూటమి విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తిరుపతి సమీపంలోని దామినీడులో ఎన్డీయే విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ హాజరుకానున్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ సభను నిర్వహిస్తున్నట్టు కూటమి వర్గాలు తెలిపాయి.

ఇక మరోవైపు, వైఎస్సార్‌సీపీ తరఫున తిరుపతిలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో చేపట్టనున్న నిరసన కార్యక్రమాల షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేడర్‌, ప్రజలు అందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్టు వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ, ఎన్డీయే విజయోత్సవ సభ ఒకే రోజున, ఒకే నియోజకవర్గంలో జరగడం వల్ల పరిస్థితిని సమీక్షించిన జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది.

తిరుపతి నగరంలోని కీలక కూడళ్లు, సభా ప్రాంగణాలు, ర్యాలీ మార్గాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వెయ్యి మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించినట్టు సమాచారం. ట్రాఫిక్ నియంత్రణ, జనసందోహం నిర్వహణ కోసం ప్రత్యేక బందోబస్తు ప్లాన్‌ రూపొందించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఒకవైపు అధికార ఎన్డీయే విజయోత్సవం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ ఒకేసారి జరగడం వల్ల తిరుపతి రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారింది. రెండు పక్షాల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి.