గండికోటలో సందడి చేసిన ‘రణబాలి’ చిత్రబృందం

జమ్మలమడుగు:- పర్యాటక కేంద్రమైన గండికోటలో రెండు రోజులుగా ‘రణబాలి’ చిత్రబృందం సందడి చేస్తోంది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ కోట పరిసరాల్లో చిత్ర యూనిట్‌ రోజంతా షూటింగ్‌ నిర్వహించింది. కోట అందాలు, పురాతన నిర్మాణాలను నేపథ్యంలో ఉంచుకుని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

కథానాయకుడు విజయ్‌ దేవరకొండ గుర్రపు స్వారీ చేస్తూ గండికోట కోట ముఖద్వారం వద్దకు వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. కోట ప్రవేశ ద్వారం, పరిసర ప్రాంతాల్లో భారీ యూనిట్‌ పాల్గొనగా, స్థానికులు, పర్యాటకులు షూటింగ్‌ను ఆసక్తిగా వీక్షించారు. గుర్రపు స్వారీ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు.

కోట ఆవరణలోని ధాన్యాగారంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. పురాతన ధాన్యాగారం లోపలి నిర్మాణం, వెలుతురు, వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునేలా చిత్రబృందం కెమెరా యాంగిల్స్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. గండికోట సహజ సౌందర్యం, చారిత్రక నిర్మాణాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో, టీ సిరీస్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, సాంకేతిక నిపుణుల బృందంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. గండికోటతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా షూటింగ్‌ జరపాలని యూనిట్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

బుధవారం నుంచి గండికోట ముఖద్వారం, ధాన్యాగారం, పెన్నాలోయ తదితర ప్రాంతాల్లో జరగనున్న చిత్రీకరణలో కథానాయిక రష్మిక పాల్గొననున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పెన్నా నది లోయ, గండికోట గోర్జ్‌ పరిసరాల్లో రొమాంటిక్‌, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి కొన్ని రోజులు గండికోట పరిసరాల్లోనే షూటింగ్‌ కొనసాగనుంది.