అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆయన వివరించారు. దీనితో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని చెప్పారు.

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలని సంబంధిత శాఖలు సూచిస్తున్నాయి.