వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఘోర విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని పోలేరమ్మ గుడి సమీపంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ ఆలయం వద్ద నివాసముంటున్న వెంకట భరత్ (18) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.

శనివారం సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో విద్యుత్ లైన్‌పై చెట్టు కొమ్మ విరిగి పడడంతో మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. అదే మార్గంలో వెళ్తున్న బీజేపీ మండల నాయకుడు చంద్ర ఓబుల రెడ్డి ఈ విషయాన్ని గమనించి, వెంటనే స్థానిక విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

విద్యుత్ తీగలపై పడిన చెట్టు కొమ్మను తొలగించే క్రమంలో విద్యుత్ సిబ్బంది వెంకట భరత్‌ను చెట్టుపైకి ఎక్కించినట్టు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ఈ సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో అతడు ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెట్టుపై నుంచి కిందకు పడిపోయాడు.

ఈ ప్రమాదంలో వెంకట భరత్ తలకు, కాళ్లకు, పొట్టకు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నివాస ప్రాంతాల్లో చెట్లపై నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి, సరైన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

విద్యుత్ ఏఈ వివరణ

ఈ ఘటనపై బ్రహ్మంగారిమఠం విద్యుత్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ వివరణ ఇచ్చారు. వనదుర్గమ్మ ఆలయం వద్ద శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి గాయాల పాలైన బాలుడిని తాము విద్యుత్ స్తంభం ఎక్కించలేదని ఆయన తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండానే అతడు స్తంభం ఎక్కాడని ఏఈ పేర్కొన్నారు.

విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మ పడి మంటలు వస్తున్నాయన్న సమాచారం అందిన వెంటనే తమ సిబ్బందిని అక్కడికి పంపించినట్టు ఆయన వివరించారు. ప్రమాదానికి గురైన బాలుడు వారి ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్న కారణంతో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజులు తీసేసి, విద్యుత్ స్తంభం ఎక్కి సరిచేసుకునే ప్రయత్నంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తగిలి కింద పడిపోయాడని ఏఈ తెలిపారు.

అంతేకాకుండా ఆ బాలుడి ఇంటికి కనీసం విద్యుత్ మీటర్ కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఘటనపై సంబంధిత విభాగాలు మరిన్ని వివరాలు సేకరిస్తున్నాయి.