కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం లింగాలదిన్నెపల్లె ఎస్టీ కాలనీకి చెందిన 94 మంది పేద కుటుంబాలకు మంజూరైన అసైన్డ్ భూములను రెడ్ మార్క్ నుండి తొలగించి, పాస్ పుస్తకాలు మంజూరు చేసి ఆన్లైన్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి.శివకుమార్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బి.జక్కరయ్య డిమాండ్ చేశారు.

అసైన్డ్ భూముల సాధన కమిటీ (వ్యవసాయ కార్మిక సంఘం అనుబంధం) ఆధ్వర్యంలో లింగాలదిన్నెపల్లె ఎస్టీ కాలనీ గ్రామ ప్రజలు గురువారం బ్రహ్మంగారి మఠం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భూ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ధర్నా సందర్భంగా జి.శివకుమార్, బి.జక్కరయ్యలు మాట్లాడుతూ 2007లో భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అసైన్డ్ మెంట్ కమిటీ ద్వారా లింగాలదిన్నెపల్లె ఎస్టీ కాలనీకి చెందిన ఎస్టీ, బీసీ కుటుంబాల 94 మందికి పలుగురాళ్లపల్లె రెవెన్యూ పొలం 1938 సర్వే నంబరులో ఎకరా చొప్పున భూములు మంజూరు చేసి పంపిణీ చేశారని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఆ భూముల్లో పేదలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.

పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులను ఎన్నిసార్లు అడిగినా “మీ భూములు రెడ్ మార్క్‌లో ఉన్నాయి” అనే సమాధానం మాత్రమే వస్తోందని, అసైన్డ్ భూములను ఈ విధంగా రెడ్ మార్క్‌లో పెట్టడం సరైంది కాదని వారు ప్రశ్నించారు. 1938 సర్వే నంబరును రెడ్ మార్క్ నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

అధికారులు రెడ్ మార్క్ పెట్టడం వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రమేయం ఉందేమోననే అనుమానం కలుగుతోందని నాయకులు వ్యాఖ్యానించారు. భూకబ్జాదారులు వందల ఎకరాలు ఆక్రమించుకున్నా వాటికి రెడ్ మార్క్ ఉండదని, ఎస్టీ, బీసీ పేద కుటుంబాలకు ఇచ్చిన ఒక్కో ఎకరా భూమికి మాత్రం రెడ్ మార్క్ పెట్టడం విచిత్రమని మండిపడ్డారు. పేదల భూములకు ఎర్ర తివాచీ పరచి, కబ్జాదారుల భూములకు ఎర్ర మార్క్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి రికార్డులను ఇష్టారాజ్యంగా మారుస్తున్నారని వారు ఆరోపించారు. పలుగురాళ్లపల్లె రెవెన్యూ పొలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని ఆ ప్రాంతంలోని భూమిలేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదలతో కలిసి భూస్వాధీనం కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ధర్నా అనంతరం డిప్యూటీ తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అసైన్డ్ లబ్ధిదారుల పూర్తి వివరాలు అందజేస్తే ఆన్లైన్ ప్రక్రియ చేపడతామని డిప్యూటీ తహసిల్దార్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు హరి, ఉపాధ్యక్షుడు గండి సునీల్ కుమార్, నాయకులు అజయ్ కుమార్, గురయ్య, అసైన్డ్ భూముల సాధన కమిటీ నాయకులు ఆంజనేయులు, రామాంజనేయులు, బ్రహ్మయ్య, వెంకటకృష్ణ, కొండమ్మ, రఘు, మద్దిలేటి, భూదేవి, నాగేశ్వరమ్మ తదితర బాధితులు పాల్గొన్నారు.