రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లె గ్రామంలోని మహా గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నా, జిల్లా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తోట్లపల్లె మహా గురుకులాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ, గత విద్యాసంవత్సరం ప్రారంభంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మహా గురుకులం, ఇప్పుడు రెండో విద్యాసంవత్సరం పూర్తికావస్తున్నా విద్యార్థులకు కనీస వసతులు కూడా కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వారిని గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు.
విద్యార్థుల వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో అనేక లోపాలు ఉన్నాయని, పాఠశాల నిర్వహణపై జిల్లా అధికారులు పర్యవేక్షణ సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అధికారుల నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మెనూ అమలు విషయంలో జరుగుతున్న అక్రమాలను కూడా నాయకులు ఎండగట్టారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు వారంలో రెండుసార్లు చికెన్ ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి విద్యార్థికి వారానికి 360 గ్రాముల చికెన్ అందించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఒక్క విద్యార్థికి 120 గ్రాములు మాత్రమే ఇస్తూ, మిగిలిన 240 గ్రాముల చికెన్ విలువను ఎవరైనా దోచుకుంటున్నారని, విద్యార్థుల హక్కులను బలిగొడుతున్నారని ఆరోపించారు.
విద్యార్థుల ఆహార నాణ్యత, పరిమాణంపై వెంటనే దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహా గురుకులంలో ఉన్న ప్రతి విద్యార్థికి నిబంధనలకు అనుగుణంగా ఆహారం, వసతి, విద్యా సదుపాయాలు కల్పించే బాధ్యత జిల్లా అధికారులదేనని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి గుడిమే సురేష్ కుమార్, నాయకులు సుమంత్ కుమార్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు సంబంధిత అధికారులను కోరారు.













