రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యు గంధర్ పోరుమామిళ్ల మండలంలోని టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం జరిగిన ఈ తనిఖీలో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల తీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా ఈ-హెల్త్ రికార్డ్స్, ఈడిడి క్యాలెండర్, ఫార్మసీ విభాగం, ల్యాబొరేటరీ పనితీరును డాక్టర్ గంధర్ పరిశీలించారు. మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, వ్యాక్సినేషన్ విభాగాల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆసుపత్రి సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. జిల్లాలోనే ఆదర్శ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా టేకూరుపేట పీహెచ్‌సీ నిలవాలనే లక్ష్యంతో ప్రతి విభాగం సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తనిఖీల అనంతరం పోరుమామిళ్ల, టేకూరుపేట, కలసపాడు, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలతో మాతా-శిశు ఆరోగ్యంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, నిర్దేశిత లక్ష్యాల సాధన, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడం, మాతా-శిశు మరణాల శాతాన్ని తగ్గించడం, టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ప్రతి పీహెచ్‌సీ స్థాయిలో రికార్డుల నిర్వహణ, ఫాలోఅప్ సేవలు, అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జె. ప్రవీణ్ కుమార్, ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్, జిల్లా మలేరియా అధికారి, బద్వేల్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లేష్, డిపిఓ నారాయణ, వైద్యాధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ సాయి తేజ, డాక్టర్ మేరి ఎలీషా, డాక్టర్ జయ రామ్, డాక్టర్ ప్రశాంతి, పోరుమామిళ్ల మెడికల్ ఆఫీసర్ శ్రీవిద్య, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.













