జమ్మలమడుగు పట్టణంలో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు. జనావాసాలు, ప్రధాన వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో నీళ్ల ట్యాంకు వీధిలో ఐదుగురిపై, ఒకటో వార్డు వెంకటేశ్వర కాలనీలో పిచ్చి కుక్క దాడి చేసి మరో ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు స్థానికులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనల తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు, భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI) నిబంధనల ప్రకారం వీధి కుక్కలను పట్టుకుని వాటికి సంతాన నిరోధక చికిత్సలు (ABC) చేయడంతో పాటు యాంటీ రేబిస్ టీకాలు వేసి ఐదు రోజుల తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తిస్థాయి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, మున్సిపల్ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పట్టణంలోని ఈడిగపేట, నీళ్ల ట్యాంకు వీధి, ఎర్రపువారి కాలనీ, పలగాడి వీధి, తాడిపత్రి రోడ్డు, బురుజు వీధి, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగాలకు వెళ్లే వారు, మహిళలు తీవ్ర భయంతో ప్రయాణం చేయాల్సి వస్తోంది.

జమ్మలమడుగు పురపాలక సంఘం పరిధిలో సుమారు 210 చికెన్ సెంటర్లు, మాంసం దుకాణాలు ఉండటం వల్ల వాటి సమీపంలో కుక్కలు మకాం వేసి అటుగా వెళ్లే కాలినడకన వెళ్లేవారిని, వాహనదారులను వెంటాడుతున్నాయి. మాంసపు వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడేయడం వల్ల కుక్కలు ఆ ప్రాంతాలకే చేరి స్థిరపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు సుమారు 2,000 పైగా కుక్క కాటు కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. జమ్మలమడుగు నుంచే కాకుండా మైలవరం, పెద్దముడియం, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల సరిహద్దు ప్రాంతాల నుండి కూడా బాధితులు జమ్మలమడుగు ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చి యాంటీ రేబిస్ టీకాలు వేయించుకుంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని, సుప్రీంకోర్టు, AWBI మార్గదర్శకాల ప్రకారం జంతు జనన నియంత్రణ కేంద్రం ఏర్పాటు, సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు వంటి చర్యలను వేగంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కల సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరిన్ని ప్రాణనష్టం, గాయాల ప్రమాదం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.