రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప - తాడిపత్రి ప్రధాన జాతీయ రహదారిలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చెన్నారెడ్డిపల్లె గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తాడిపత్రి వైపు నుంచి ఎర్రగుంట్ల దిశగా వెళ్తున్న ఒక ట్రాక్టర్, ముద్దనూరు వైపుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న చెన్నారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గుజ్జల కృష్ణయ్య (40)ను ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కృష్ణయ్య తలకు, వెనుక భాగానికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.
అక్కడికక్కడే పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
సొంత పని నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుని ఇంటి వద్ద ఆర్తనాదాలు మిన్నంటాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరి కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.
గుజ్జల కృష్ణయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రిని కోల్పోవడంతో వారు అనాథలుగా మిగిలిపోయారని, ఈ ఘటనతో కుటుంబం ఆర్థిక, మానసికంగా కుదేలైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.













