వైయస్సార్ జిల్లాలో వైయస్సార్ సిపి నాయకుడు అంబటి సురేష్‌పై కిడ్నాప్, దాడి ఘటన కలకలం రేపింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై విమర్శ చేశాడనే కారణంతో టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని వైయస్సార్ సిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

రామాలయం సమీపంలో ఉన్న అంబటి సురేష్‌ను బలవంతంగా ఆటోలో ఎక్కించి టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు వైయస్సార్ సిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి అంబటి సురేష్‌ను బయటకు తీసుకువచ్చారు. అనంతరం వైయస్సార్ సిపి ఇంచార్జ్ నరేన్ రెడ్డి ఆసుపత్రిలో సురేష్‌ను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలియజేశారు.

వైయస్సార్ సిపిలో చురుగ్గా పనిచేస్తున్నానని పుత్తా అనుచరులు నాపై దాడి చేశారు. రామాలయం దగ్గర ఉంటే మెడ పట్టుకొని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి బాధితులు 130 మంది ఉండగా నన్నెక్కడిని పిలిచి దాడి చేయడం ఏంటి. వైసిపి ఇంచార్జ్ నరేన్ రెడ్డి బాధితులను పరామర్శిస్తుంటే ఆయన వెంట ఉండడమే తప్పంటూ చితకబాదారు. పుత్తా అనుచరులు పార్టీ కార్యాలయంలో వేసి చితక్కొట్టారు.

అంబటి సురేష్‌పై దాడి నేపథ్యంలో వైయస్సార్ సిపి ఇంచార్జ్ నరేన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

పార్టీలో ఆక్టివ్‌గా ఉన్న సురేష్‌పై దాడి చేయడం దుర్మార్గం. అంతమంది బాధితులు ఉండగా ఆర్యవైశ్యుడైన సురేష్ ఒక్కడే దొరికాడా. వైసిపి నాయకుడు అన్న నెపంతో ఆటోలో ఎక్కించుకొని పోయారు. టిడిపి కార్యాలయంలో ఉంచి చితక్కొట్టి భయబ్రాంతులకు గురి చేశారు. నష్టపరిహారం చెల్లిస్తే మేమే కొట్టేసుకుంటామంటున్నారు. కాంట్రాక్టర్లకు పెంచిన రేటు ప్రకారమే బాధితులు అడుగుతున్నారు. సురేష్‌కు జరిగింది చాలా అవమానం. భయపెడితే భయపడే రకం కాదు వైసిపి నాయకులు. మీ తాటాకు చప్పులకు వైయస్సార్ సిపి నాయకులు కానీ పార్టీ కానీ భయపడదు. ప్రతిఘటించే రోజులు దగ్గరపడ్డాయి, ప్రతిఘటించి తీరుతాం. భయపడితే ఓట్లు వస్తాయనుకోవడం మీ మూర్ఖత్వం. వయసులో పెద్దవారు మీరు ఇలాంటోళ్లను పట్టుకొని కొట్టడమా. సరైనోలతో తగలాలని పుత్తా హితవు. ఇలాంటి దాడులు ప్రజలు గమనిస్తున్నారు, సరైన సమయంలో స్పందిస్తారు. సురేష్‌కు పార్టీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండాలి. ఇలాంటి దాడులు వైయస్సార్ సిపి ఖండిస్తోంది.

అంబటి సురేష్‌పై జరిగిన కిడ్నాప్, దాడి ఘటనతో వైయస్సార్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సంఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.