రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప:- వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-26 (VBYP) పేరుతో దిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇద్దరు యువతులు ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ మై భారత్ ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించింది.
ఈ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి లోక్‌సభ గౌరవ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన యువతతో ఈ కార్యక్రమం చురుకుగా సాగింది. యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడం, దేశ నిర్మాణంలో వారి పాత్రను బలపరచడం ఈ యూత్ పార్లమెంట్ లక్ష్యంగా మై భారత్ నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కడప జిల్లాకు చెందిన వెంకట సాహిత్య, అన్నమయ్య జిల్లాకు చెందిన తన్మయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన ఈ ఇద్దరు యువతులు, దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో తమ నాయకత్వ నైపుణ్యాలు, ప్రసంగ సామర్థ్యంతో ఆకట్టుకున్నట్లు సమాచారం.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువత ముందుకు వచ్చి సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి యువత ఆలోచనలు, సూచనలను వినిపించే వేదికగా ఈ యూత్ పార్లమెంట్ నిలిచింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించడం వల్ల యువతకు పార్లమెంటరీ వ్యవస్థపై ప్రత్యక్ష అనుభవం లభించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
కడపకు చెందిన వెంకట సాహిత్య, అన్నమయ్య జిల్లాకు చెందిన తన్మయి పాల్గొనడం రాష్ట్రానికి గర్వకారణమని మై భారత్ జిల్లా యూత్ కార్యాలయం యువజన అధికారి ఐసయ్య తెలిపారు. ఈ ఇద్దరు యువతులు తమ ప్రతిభ, నాయకత్వ లక్షణాలతో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, ఇతర యువతకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన అభిప్రాయపడ్డారు.
యువత సామాజిక సేవ, దేశాభివృద్ధి పట్ల చైతన్యంతో ముందుకు రావాలనే ఉద్దేశంతో మై భారత్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఈ యూత్ పార్లమెంట్ మరోసారి స్పష్టంచేసిందని పాల్గొన్న ప్రతినిధులు భావిస్తున్నారు.













