రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప, : శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్య సాధనలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఎ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు 'Sunday's on Cycle' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన సైక్లింగ్ ర్యాలీ ఎన్టీ ఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లి, మహావీర్ సర్కిల్, డా. బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్, ఎస్పీ బంగ్లా, కో ఆపరేటివ్ కాలనీ మీదుగా తిరిగి జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంది. పోలీస్ సిబ్బంది, ఇతర పాల్గొనేవారు ఉత్సాహంగా సైక్లింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య మాట్లాడుతూ సైక్లింగ్ సహజసిద్ధమైన వ్యాయామమని తెలిపారు. ప్రతి ఆదివారం పోలీసులు, ప్రజలు సైక్లింగ్‌ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు.
సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఒత్తిడిని తగ్గించడంలో, మానసిక ప్రశాంతత సాధనలో కూడా ఉపయోగకరమని చెప్పారు. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం ద్వారా క్యాలరీలు ఖర్చై బరువు తగ్గడానికి తోడ్పడుతుందని, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సైక్లింగ్ సహాయపడుతుందని వివరించారు.

పోలీస్ సిబ్బంది మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని శారీరక వ్యాయామానికి కేటాయించాలని బి.రమణయ్య సూచించారు. వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించినప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుందని, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఆధునిక జీవనశైలిలో వాహనాల్లో ప్రయాణించడం అందరికీ అలవాటైపోయిందని, సైక్లింగ్ ద్వారా పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మన ఆరోగ్యం బాగుంటుందని బి.రమణయ్య పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ఎ.ఆర్ డి.ఎస్పీ పి. నాగేశ్వర రావు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సైక్లింగ్ ర్యాలీని విజయవంతం చేయడంలో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది చురుకుగా వ్యవహరించారు.













