కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత విస్తృతంగా కొనసాగేందుకు చేపట్టిన అదనపు స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వాటి నిర్వహణ పటిష్టంగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులు ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు విస్తరణపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో అదనంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణం, నిర్వహణ పనుల పురోగతిపై సంబంధిత కమిటీ సభ్యులతో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమగ్రంగా సమీక్షించారు.

సమావేశంలో స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణ దశలు, పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, శిక్షణ, సరఫరా వ్యవస్థ, రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ వంటి అంశాలపై అధికారులు వివరాలు సమర్పించారు. ప్రతి మండలంలో స్మార్ట్ కిచెన్‌ల ద్వారా మధ్యాహ్న భోజన పథకం అమలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్‌ల విస్తరణ పనులు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణ పనుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.

స్మార్ట్ కిచెన్‌ల నిర్వహణపై ఫీల్డ్ స్థాయిలో అందుతున్న సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఆహార నాణ్యత, పరిశుభ్రత, సమయపాలన, విద్యార్థుల హాజరు వివరాలు వంటి అంశాలపై డేటా నమోదు ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి అధికారి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో అమలు చేస్తున్న ఈ వ్యవస్థ జాతీయ స్థాయిలో కూడా ఆదర్శంగా నిలిచేలా అన్ని విభాగాలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. స్మార్ట్ కిచెన్‌ల ద్వారా మధ్యాహ్న భోజన పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.