కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 455 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ కేసులపై మొత్తం రూ.1,02,939 జరిమానాలు విధించినట్లు ఆయన వివరించారు.

జిల్లాలోని ప్రధాన రహదారులు, పట్టణాలు, ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా వాహనాలు నడిపిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినట్లు ఎస్పీ చెప్పారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించే ఘటనలు, కార్లలో సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం, రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఇకపై మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు.

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.