కడప శివారులోని పాలకొండల రింగ్‌రోడ్డుపై ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మృతదేహాలను జిల్లా పోలీస్‌ కార్యాలయం ఎదుట ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసనకు దిగారు. ట్రాఫిక్‌ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. యువకుల మృతి చుట్టూ అనుమానాలు ఉన్నందున పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజాలు వెలుగులోకి తేవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

కడప శివారులోని సింగ్‌పూర్‌ టౌన్‌షిప్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్‌కుమార్‌రెడ్డి (21), జస్వంత్‌కుమార్‌రెడ్డి (22)లు మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి కడప నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. జస్వంత్‌కుమార్‌రెడ్డి హోమియోపతి కళాశాలలో ఆయుర్వేద వైద్యవృత్తిని అభ్యసిస్తున్నాడు.

వీరిద్దరూ ఊటుకూరు నుంచి నగరవనానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో శనివారం రాత్రి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ట్రాఫిక్‌ పోలీసులు ప్రాథమిక సమాచారం రూపంలో నమోదు చేశారు.

అయితే తమ కుమారుల మృతిపై ట్రాఫిక్‌ సీఐ రెండు వైపులా మాట్లాడుతున్నారని, రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకోలేదని మృతుల తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, ఉమా, హనుమంతురెడ్డి, కళావతి ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఆదివారం ఎస్పీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద మృతదేహాలతో ఆందోళన చేపట్టారు.

ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి ఇన్‌ఛార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఒకటో పట్టణ సీఐ తిమ్మారెడ్డి, ఎస్సైలు ప్రదీప్‌కుమార్‌, అమర్‌నాథ్‌రెడ్డి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అనంతరం ఆందోళనకారులు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను వివరించారు.

రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి న్యాయం చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లారు. ట్రాఫిక్‌ సీఐ తులసీరామ్‌ ప్రమాదం చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని బంధువులు ఆరోపించారు.

ఇదిలా ఉండగా, మరో ఆరు నెలల్లో ఇరువురు యువకుల విద్య పూర్తి కావాల్సి ఉండగా ఇంతలోనే వారు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పవన్‌కుమార్‌రెడ్డి ఒక్కడే కొడుకు. అతని సోదరి అఖిలారెడ్డి లండన్‌లో చదువుతోంది. రెండు నెలల క్రితం అఖిలారెడ్డి రూ. 2.20 లక్షలు వెచ్చించి పవన్‌కుమార్‌రెడ్డికి ద్విచక్రవాహనం కొనిచ్చి లండన్‌కు వెళ్లింది. వెళ్లిన కొద్ది నెలల్లోనే తమ్ముడు ఇలా మృతి చెందడంతో అఖిలారెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

జస్వంత్‌కుమార్‌రెడ్డి తండ్రి హనుమంతరెడ్డి హైదరాబాదులో హోమియోపతి ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. చేతికొచ్చిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా మృతి చెందడంతో ఇరు కుటుంబాల సభ్యులు గుండెలవిసేలా రోదిస్తూ అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు.