రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పరీక్ష పత్రం లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి భాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు.
డిల్లీలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నాయకులు తీవ్రంగా విమర్శించారు. నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు.
సోమవారం కడపలోని మహావీర్ సర్కిల్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు వివిధ సంఘాలు, విద్యార్థి సంస్థలు ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోమోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి, వైయస్సార్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయి దత్త, డివైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివ తదితరులు పాల్గొని మాట్లాడారు.
నాయకులు నీట్ పేపర్ లీకేజీ వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలపై నమ్మకం దెబ్బతింటోందని, విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షా వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటివరకు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాయకులు తెలిపారు. ఈ మరణాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇవి ప్రభుత్వ హత్యలేనని వారు ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలు తీసే విధంగా వ్యవస్థ పనిచేయడం అంగీకారయోగ్యం కాదని, వెంటనే బాధ్యులను శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.













