రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: తిలక్‌నగర్‌లో “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమం
వైఎస్సార్ కడప జిల్లాలో కీటక వాహక వ్యాధుల నివారణకు భాగంగా “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు నేడు తిలక్‌నగర్‌లో నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, లింఫాటిక్ ఫైలేరియాసిస్ (బోదకాలు), జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి, సాధారణ లక్షణాలు ఏమిటి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, సకాలంలో వైద్య సేవలు పొందడం ఎందుకు అవసరమో వివరించారు. దోమల ఉత్పత్తి ప్రదేశాలను నిర్మూలించడం ద్వారా మాత్రమే ఈ వ్యాధులను అదుపులో పెట్టగలమని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు తెలియజేశారు.

ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నీటి నిల్వ పాత్రలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, కూలర్లు, పూలకుండీలు, వాడిపారేసిన టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి దోమల లార్వా పెరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించి, పాత్రలను శుభ్రంగా రుద్ది కడిగి, పూర్తిగా ఆరబెట్టేలా సూచించారు. దోమల లార్వా వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి నిర్మూలించారు.

ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పలు సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించాలని, ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి, రుద్ది కడిగి, పూర్తిగా ఆరబెట్టాలని, నీటి ట్యాంకులు, డ్రమ్ములు, ఇతర పాత్రలపై మూతలు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. పనికిరాని పాత్రలు, ఘన వ్యర్థాలను సక్రమంగా తొలగించాలని, దోమతెరలు, కిటికీలకు జాలీలు, దోమల నివారణ మందులు, శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.

జ్వరం, చలి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు లేదా కీళ్ల నొప్పులు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం చేసుకోకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా 104 SCP సేవలకు సంబంధించి ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అందాయి. వాటిపై ఆయన వెంటనే స్పందించి, 104 సేవల జిల్లా సమన్వయకర్తకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సమన్వయకర్తకు స్పష్టం చేశారు.

వైద్యాధికారులు, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది క్రమం తప్పకుండా దోమల ఉత్పత్తి ప్రదేశాల నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించాలని, జ్వర పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అనుమానిత కేసులను ముందుగానే గుర్తించి సకాలంలో పరీక్షలు, చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశించారు.
ప్రజల చురుకైన భాగస్వామ్యం, పరిసరాల పరిశుభ్రత, సత్వర ఆరోగ్య సేవలు, ప్రతి వారం దోమల ఉత్పత్తి ప్రదేశాల నిర్మూలన ద్వారానే కీటక వాహక వ్యాధుల నుంచి ప్రతి కుటుంబాన్ని రక్షించగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పేర్కొన్నారు.













