కడప వినాయక ఘాట్ వద్ద ఇటీవల చేపట్టిన అభివృద్ధి, స్వచ్ఛత కార్యక్రమాల వల్ల ఘాట్‌కు సరికొత్త శోభ సంతరించుకుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఆదివారం ఆయన వినాయక ఘాట్‌ను సందర్శించి, అక్కడ పూర్తయిన సీసీ బండ్, మెట్లు, డ్రెయిన్ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ వినాయక ఘాట్‌ను గణేశ్ నిమజ్జన సమయంలో మాత్రమే కాకుండా, సంవత్సరమంతా పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. గత మూడు నెలలుగా జేసీబీల సహాయంతో ఘాట్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పలుమార్లు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఘాట్ పరిసరాల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ముగ్గురు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించినట్టు కమిషనర్ పేర్కొన్నారు. వారు వినాయక ఘాట్‌ను శుభ్రంగా ఉంచడంతో పాటు కేసీ కెనాల్‌లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కేసీ కెనాల్‌లో చెత్త వేయొద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు చెత్త సేకరణ ట్రాలీలను కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

ఇటీవల కేసీ కెనాల్‌లో విస్తరించిన గుర్రపుడెక్క మొక్కలను పూర్తిగా తొలగించినట్టు చల్లా ఓబులేసు తెలిపారు. ఈ చర్యల ఫలితంగా ప్రస్తుతం వినాయక ఘాట్ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని వినాయక ఘాట్ అభివృద్ధి కోసం సీసీ రహదారి, మెట్లు, బండ్, రాతి నిర్మాణాలు, డ్రెయిన్, ఫెన్సింగ్ వంటి పలు పనులను చేపట్టినట్టు కమిషనర్ తెలిపారు. ఈ అభివృద్ధి పనుల వల్ల ఘాట్ నూతన శోభను సంతరించుకుందని చెప్పారు. త్వరలోనే వినాయక ఘాట్‌కు రంగులు వేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు చల్లా ఓబులేసు వెల్లడించారు.

వినాయక ఘాట్ అభివృద్ధి, స్వచ్ఛత కార్యక్రమాల పరిశీలనలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఫరూక్, శివశంకర్ తదితరులు కమిషనర్‌తో కలిసి పాల్గొన్నారు.