రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఝార్ఖండ్ నుంచి బతుకుతెరువు కోసం వచ్చి పని చేసుకుంటున్న ఓ యువకుడు అర్ధరాత్రి ట్రాక్టర్ నడపబోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన మైదుకూరు మండలం శివపురం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పీతాంబర్ గోప్ (32) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని శివపురం పరిసరాల్లో హై టెన్షన్, లో టెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చాపాడు మండలం వెదురూరు రాజుపాళెం గ్రామానికి చెందిన భీమవరం చిన్న ఖాసింరెడ్డి అనే కాంట్రాక్టర్ ఈ పనులను చేపట్టారు. ఈ పనుల కోసం ఆయన ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి 12 మంది కూలీలను తీసుకొచ్చారు.
వారికి శివపురం సమీపంలోని గంగమ్మ దేవాలయం వద్ద వసతి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కూలీలంతా అక్కడే మాట్లాడుకుంటూ ఉండగా, పనుల కోసం వినియోగిస్తున్న కాంట్రాక్టర్ ఖాసింరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో పీతాంబర్ గోప్ తాను డ్రైవింగ్ చేయలేనప్పటికీ డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని ట్రాక్టర్ నడపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అదుపు తప్పిన ట్రాక్టర్ కేసీ కాలువ కట్టపై ఉన్న తూము కల్వర్ట్‌ను ఎక్కి, అక్కడి నుంచి కాలువలో పడిపోయి పల్టీలు కొట్టింది.
ట్రాక్టర్ పల్టీ కారణంగా పీతాంబర్ తలకు, శరీరానికి తీవ్ర గాయాలు తగిలి, ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింహభూమ్ జిల్లా ఆచూ గ్రామానికి చెందిన పీతాంబర్ గోప్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం.
అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.













