రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం MLA పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహారశైలి పట్ల ఆ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఆయన అందుబాటులో ఉండకపోవడమే ప్రధాన కారణమని శ్రేణులు ఆరోపిస్తున్నారు.
స్థానికంగా ఏ పని ఉన్నా, సమస్యలు చెప్పుకోవాలన్నా Hyderabadకి వెళ్లాల్సి వస్తోందని కార్యకర్తలు, ప్రజలు గుసగుసలాడుతున్నారు. నెలలో వారం రోజులు కూడా MLA నియోజకవర్గంలో గడపరని, ఈ పరిస్థితుల్లో తమ సమస్యలు, బాధలను ఆయన దృష్టికి ఎలా తీసుకెళ్లాలనే ఆందోళన వారికి కలుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా MLA కార్యక్రమాలు హడావిడీగా సాగుతున్నాయని, ప్రజలతో కూర్చొని మాట్లాడేందుకు, వారి సమస్యలు వినేందుకు సమయం కేటాయించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్థులు, పట్టణ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కానన్న ఆందోళనలో ఉన్నారని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.
ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడపాలని, ప్రజల మధ్య ఉండాలని తమ అభిప్రాయాన్ని కొందరు కార్యకర్తలు లోపలగానే వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ అసంతృప్తిని పార్టీ అంతర్గత వేదికలలోనే పరిమితం చేయాలా, లేక బహిరంగంగా ప్రస్తావించాలా అనే దానిపై స్థానిక శ్రేణులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
మైదుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సమస్యలు నేరుగా MLA దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నప్పటికీ, ఆయన అందుబాటు లేకపోవడం వల్ల విసుగు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి, ప్రజల మధ్య దూరం పెరిగితే, అది పార్టీకి, నాయకుడికి ప్రతికూల ఫలితాలు తీసుకురావచ్చని కొందరు సీనియర్ కార్యకర్తలు అంచనా వేస్తున్నారు.
MLA పుట్టా సుధాకర్ యాదవ్ తరచుగా నియోజకవర్గంలో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక శ్రేణులు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఆయన ఎలా సమీక్షిస్తారు, దానికి ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.













