రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన భూములను బినామీల పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భూబాగోతం వెలుగులోకి రావడంతో ప్రాంతంలో కలకలం రేగింది. బాధితులకు న్యాయం చేయాల్సిన స్థానిక ప్రభావశీలులు, తమ స్వలాభం కోసం అక్రమార్కులకు అండగా నిలిచినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన ఈ భూమార్పిడులు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
వివరాల్లోకి వెళితే, ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 89/4లో అగ్రిగోల్డ్‌కి చెందిన 1.70 ఎకరాల విలువైన భూమి ఉంది. గతంలో నివేశన స్థలాలను ప్లాట్లుగా విభజించే సమయంలో సామాజిక ప్రయోజనాల కోసం 10 శాతం స్థలాన్ని కేటాయించినట్టు రికార్డులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాల్సిన ఈ విలువైన భూమిపైన అక్రమార్కుల కన్ను పడినట్టు అధికారిక సమాచారం చెబుతోంది.
గత వైకాపా ప్రభుత్వ కాలంలో ఆ పార్టీకి చెందిన కొందరు పెద్దల అండదండలతో, పైరవీలతో తప్పుడు పత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గుడ్డేటి జయరామిరెడ్డి అనే వ్యక్తి పేరిట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిపినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అంతటితో ఆగకుండా, అగ్రిగోల్డ్ కంపెనీలోని కొందరు తమ ఆస్తులను బినామీ పేర్లతో తాళ్లమాపురం చెందిన మరో వ్యక్తికి బదిలీ చేసినట్టు కూడా ఆరోపణలు వెలువడ్డాయి.
గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ అక్రమ భూమార్పిడులు, వాటిలో వైకాపా నాయకుల ప్రమేయంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా బినామీల బాగోతం వెలుగులోకి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
కుంభకోణంపై అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. తిరుపతి సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. సీఐడీ సీఐ రారాజు సోమవారం ప్రొద్దుటూరులో పర్యటించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజును కలిసి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకుని సమగ్రంగా పరిశీలించారు.
ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాల్సిన ఆస్తులను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అంశంపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. బినామీల పేరిట భూమి బదిలీ జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుపై తాళ్లమాపురం గ్రామానికి వెళ్లి సంబంధిత పూర్తి వివరాలను సీఐడీ బృందం సేకరించింది.
అగ్రిగోల్డ్ భూముల క్రయవిక్రయాల్లో సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సీఐడీ విచారణను వేగవంతం చేసింది. రికార్డుల పరిశీలన, సంబంధిత అధికారుల వాంగ్మూలాలు, భూమి బదిలీలకు సంబంధించిన పత్రాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో కొందరు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే పలువురు వైకాపా నాయకులతో పాటు అప్పటి సబ్ రిజిస్ట్రార్‌పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది.













