రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: సమాజంలో ముఖ్యంగా కంటి వ్యాధులు ఉన్నా, వాటిని గుర్తించే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రముఖ నేత్ర వైద్యులు, స్వరూప్ కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక గాదం శెట్టి చెంచయ్య కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర చికిత్స శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సభ సహకారంతో, స్వరూప్ కంటి నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలు పొందారు.
ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత నేత్ర చికిత్స శిబిరాల ప్రధాన ఉద్దేశ్యం, కంటికి వ్యాధి ఉందన్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం అని వివరించారు. మధుమేహం ఉన్నవారిలో దీర్ఘకాలంలో కంటి నరాలకు నష్టం కలిగే అవకాశంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి ఆకర్షించారు.

ఉచిత నేత్ర చికిత్స శిబిరంలో ప్రధానంగా కంటికి జబ్బు ఉందన్న ప్రమాదాన్ని గుర్తించడమే లక్ష్యం. మధుమేహం వ్యాధి ఉన్న వారు 10 ఏళ్ల అనంతరం కంటి నరాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల కంటి నొప్పి ఉండదు కానీ, ఇతర సమస్యలు ఎదురు కాకపోయినా చూపు మాత్రం కోల్పోయే ప్రమాదం ఉంది. కావున ప్రతి ఒక్కరూ కంటిని కాపాడుకునేందుకు ప్రతి సంవత్సరానికి ఒకసారి నేత్ర వైద్యున్ని సంప్రదించి కంటి చూపును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
కంటి వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయని, అందులో ముఖ్యంగా పిల్లల్లో కనిపించే మెల్లకన్ను వంటి సమస్యలు భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాంటి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ఈ శిబిరం నిర్వహణలో అందించిన సహకారాన్ని డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి అభినందించారు. శిబిరంలో సుమారు 150 మంది వరకు పాల్గొని తమ కంటి సమస్యలకు సంబంధించిన ఉచిత పరీక్షలు, అవసరమైన చికిత్సలు పొందినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్యులు వైవి ధీరజ్ రెడ్డి, డాక్టర్ ఏ గగన్ రెడ్డి, ఆర్యవైశ్య సభ కార్యదర్శి మురికి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.













